ఒప్పందం లేనప్పుడు ఊరేగింపు ఎందుకు?
ఇలా అవమానిస్తే సభలో ఉండం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో ప్రాజెక్టులపై ఒప్పందం కుదరనప్పుడు అంత పెద్ద ఎత్తున ఎందుకు ఊరేగింపు జరిపారని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్రతో ఒప్పందంపై వస్తున్న వార్తలమీద స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో ఆదివారం జరిగిన ధన్యవాద తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రసంగిస్తుండగా.. పలు అంశాలపై ఉత్తమ్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ప్రస్తావిస్తూ.. మీ చరిత్ర చాలా వుంది అంటూ సీఎం పలుమార్లు వ్యాఖ్యానించారు. సీఎం ఇంతగా అవమానిస్తే సభలో ఉండబోమని ఉత్తమ్ వ్యాఖ్యానించగా...సీఎం బెదిరింపులకు దిగుతున్నారని ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్ల అంచనాలతో రూపొందించగా, ప్రస్తుతం దాన్ని రూ.83 వేల కోట్ల అంచనాలతో మార్పు చేయడాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.