మూడు వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నాయని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఇన్నోవా డీలర్లు.. సిమెంట్ కంపెనీలు.. ప్రైవేటు కాలేజీలు.. కేసీఆర్ ఆరు నెలల పాలనలో ఈ మూడు వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నాయని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు.
శనివారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ ‘ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కేసీఆర్‌కు ముందున్నది ముసళ్ల పండగ.. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్టేది లేదు’ అంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు వివేక్, సిరిసిల్ల రాజయ్య, పీసీసీ మాజీ అధ్యక్షులు నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.