బిల్లు చూసి ‘షాక్’య్యారు
డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని పలు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ వర్క్‌షాపులకు సంబంధించి ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే వేలల్లో బిల్లులు వేశారని వర్క్‌షాపుల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తమకు ట్రాన్స్‌కో అధికారులు పంపించిన నోటీసులు, బిల్లులను వారు విలేకరుల చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెలా 1500 లోపు మాత్రమే విద్యుత్ బిల్లులు వచ్చేవని, అధిక లోడు వినియోగం పేరిట ట్రాన్స్‌కో అధికారులు 20 వేల నుంచి 70 వేల వరకు బిల్లులు కట్టాలని నోటీసులు పంపించారని వాపోయారు.
తమ వర్క్‌షాపులను తనిఖీ చేయకుండానే అధిక బిల్లులు పంపించడం దారుణమని విమర్శించారు. రోజుకు *300 నుంచి *500 సంపాదన కలిగిన తాము వేల రూపాయలల్లో బిల్లులను ఎలా కట్టాలని వాపోయారు. ఇలా అయితే తాము వర్క్‌షాపులను మూసుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. షాపులో ఒక లేత్ మిషన్ మాత్రమే ఉంటే మూడు ఉన్నాయని, ఒక కటింగ్ మిషన్ ఉంటే నాలుగు ఉన్నాయని తప్పుడు నివేదికలు రాసి నోటీసులు పంపించం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అలాగే 7 హెచ్‌పీ కరెంట్ అనుమతి ఉండగా, 41.98 హెచ్‌పీ వాడుకుంటున్నామంటూ తప్పుడు నోటీసులు పంపించారని ఆరోపించారు.
అసలు 41 హెచ్‌పీ కరెంట్ వాడుకుంటే ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ సరిపోదనే విషయం అధికారులకు తెలియదా అంటూ ప్రశ్నించారు. 2012 డిసెంబర్, 2013 జనవరి నెలలకు సంబంధించిన నోటీసులు ఇప్పుడు పంపించారని భాధితులు వాపోయారు. ఈ విషయమై ట్రాన్స్‌కో అధికారులకు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు ట్రాన్స్‌కో అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. విలేకరులతో మాట్లాడిన వారిలో బాధితులు మహబూబ్, నయీం, అర్షద్, కుర్షీద్, అన్వర్, సురేశ్ తదితరులు ఉన్నారు.