బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ..
♦ యువతి ఆత్మహత్యాయత్నం
♦ తన చావుకు ఏసీపీ కూడా కారణమంటూ లేఖ
♦ ప్రేమ వివాహం.. బలవంతపు పెళ్లంటూ ఫిర్యాదు
♦ ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టడంపై మనస్తాపం
మందమర్రి (చెన్నూర్): తనను బలవంతంగా పెళ్లి చేసుకొని ఫొటోలు వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో పెట్టి పరువుకు భంగం కలిగించాడని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో క్యాతం శ్రీవాణి కుటుంబం నివసిస్తోంది. ఇటీవలే ఆమె సారంగపెల్లికి చెందిన అయిల్ల సాగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న సాగర్, శ్రీవాణి కాళేశ్వరంలో వివాహం చేసుకుని వస్తుండగా.. ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి సాగర్‌పై దాడిచేసి సోదరిని ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. సాగర్ భయపెట్టి.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ బెల్లంపల్లి ఏసీపీకి శ్రీవాణి, సోదరుడు కలసి ఫిర్యాదు చేశారు.
తాను బలవంతంగా పెళ్లి చేసుకోలేదని, పెళ్లి ఫొటోలే నిదర్శమంటూ శ్రీవాణితో దిగిన ఫొటోల్ని సాగర్ సోషల్‌మీడియాలో పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీవాణి గురువారం నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించారు. కమిషనర్‌కు ఫిర్యాదు...: తమ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్ట డం లేదని,సాగర్‌తోనే కాపురం చేయాలని ఏసీ పీ బెదిరిస్తున్నాడని శ్రీవాణి ఇటీవల మీడియా తో మాట్లాడింది. పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ దృష్టికి తీసుకెళ్లింది. తనకు న్యాయం చేయకుండా, తన అన్నయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ ఏసీపీ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది.
శ్రీవాణి రాసిన సూసైడ్ నోట్: ‘అమ్మ..అన్నయ్య..అక్కలందరూ నన్ను క్షమిం చండి. నేను చేసిన తప్పునకు క్షమించండి. ఇక ఈ భూమి మీద బతికే ఆశ నాకు లేదు. సాగర్, భీరెల్లి రాములు, పానుగంటి సతీశ్ నా వీడియోలు, ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి మన పరువు తీస్తున్నారు. ఇక్కడి ఏసీపీ సతీష్ కూడా అసభ్యంగా మాట్లాడుతూ నేను ఇచ్చిన కేసును దర్యాప్తు చేయకుండా అన్నయ్యను, నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా చావు కు ఏసీపీ సతీష్, సాగర్, రాములు, పాను గం టి సతీష్‌లే కారణం.
నా చావుకు కారణమైన వీరిని అసలే వదలకండి. అన్నయ్యా.. నన్ను క్షమించు సారీ.. సారీ’ ఇట్లు నీ చెల్లెలు శ్రీవాణి అని రాసుంది. కాగా, నిందితులపై చర్య తీసుకోవాలని శ్రీవాణి బంధువులు మంచిర్యాల ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. డీసీపీ జాన్‌వెస్లీ బాధితులతో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించుకున్నారు.