
అత్తింటి ఎదుట వివాహిత ఆందోళన
- కుటుంబీకులు కాపురానికి
- రావొద్దంటున్నారని ఆరోపణ
ఇబ్రహీంపట్నం రూరల్: అత్తింటివారు కాపురానికి రావొద్దంటున్నారని ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని కప్పపహాడ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బూడిద మోహన్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 12న మీర్‌పేట్‌కు కవితను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం ఐదు నెలల వరకు వారి కాపురం హాయిగా సాగింది. కవితకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబీకులు పుట్టింటికి పంపారు.
ఆరోగ్యం కుదుటపడగానే నెల రోజుల తర్వాత ఆమె అత్తారింటికి వచ్చింది. తర్వాత రావాలని కుటుంబీకులు చెప్పడంతో తిరిగి కవిత పుట్టింటికి వెళ్లింది. మరోసారి రాగా ఆడపడుచు అనసూయ, ఆమె భర్త బాగిరెడ్డి తనను బెదిరించి వెళ్లగొట్టారని బాధితురాలు తెలిపింది. మూడు రోజుల క్రితం అత్తారింటికి వచ్చిన ఆమెను చూసి కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. గ్రామస్తులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.