విద్యుత్ తీగలు కారు మీదపడి..
యాచారం(ఇబ్రహీంపట్నం):
కారు దగ్ధమైన సంఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే కారులోనే సజీవదహనమైంది. ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద జరిగింది. కృష్ణా జిల్లా విసన్నపేట మండలం కలగర గ్రామానికి చెందిన చిలకాని జితేందర్‌కుమార్, అతని భార్య చంద్రకళ(40), కుమారుడు వృధీన్, చంద్రకళ అమ్మ ఆరేపల్లి పద్మావతి, పశ్చిమగోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెంనకు చెందిన అక్క కలకొండ శ్రీ విద్య, మరో బంధువు కలకొండ సూర్యవిహర్‌లు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కూకట్‌పల్లి నిజాంపేట్ నుంచి కారులో యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఎస్‌ఆర్ హజరీస్‌లోని తమ బంధువుల వద్దకు వస్తున్నారు.
నాగార్జునసాగర్- హైదరాబాద్ రహదారిపై యాచారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న ఓ లారీకి రోడ్డుకు అడ్డంగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి తెగాయి. లారీ వెనకాలే జితేందర్‌కుమార్ నడుపుతున్న కారు వెళ్లడంతో దానిపై విద్యుత్ తీగలు పడి మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన చంద్రకళ సడన్‌గా కారు డోర్ తీసి కాలు కింద పెట్టగానే ఆమెకు మంటలు అంటుకొని అక్కడికక్కడే కాలిపోయింది. అదే సమయంలో ఆర్టీసీ బస్సులో మాల్‌వైపునకు వెళ్తున్న మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పల్లేటి జగన్ ప్రాణాలకు తెగించి తన వద్ద ఉన్న దుస్తులతో కారు డోర్లు తీశాడు. దీంతో జితేందర్‌కుమార్, అతని కొడుకు వృధీన్, అమ్మ పద్మావతి, అక్క శ్రీ విద్య, మరో బంధువు సూర్యవిహర్ ప్రాణాలతో బయటపడ్డారు.
కొన్ని నిమిషాల్లో బంధువుల దగ్గరకు వెళ్తుండగా...
కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జితేందర్‌కుమార్, వారి కుటుంబ సభ్యులు వేసవి సెలవుల్లో యాచారం మండలం నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఎస్‌ఆర్ హాచరీస్‌లో ఉద్యోగం చేస్తున్న తమ బంధువు వద్దకు కారులో వెళ్తున్నారు. అప్పటి వరకు చంద్రకళ తమ బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతూ కొద్ది సేపట్లోనే మీ వద్దకు వస్తున్నామని చెబుతుండగానే విద్యుత్ తీగల రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. రోడ్డు మధ్యలోనే కారు దగ్ధం కావడంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. చంద్రకళ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఎస్‌ఆర్ హచరీస్ మేనేజన్ మనోహర్‌రెడ్డి ద్వారా ప్రమాదానికి గురైన కుటుంబీకుల వివరాలు తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి డోర్లు తీసి ఐదుగురి ప్రాణాలను కాపాడిన జగన్‌ను ఏసీపీ అభినందించారు.