శిశువును ప్రసవించిన 24 గంటలకే వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందింది.
కొత్తగూడెం అర్బన్ (ఖమ్మం) : శిశువును ప్రసవించిన 24 గంటలకే వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన పెద్ది కుమారి(23) నెలలు నిండి నొప్పులు వస్తుండడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 26న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే రోజు కుమారి మగ శిశువుకు జన్మనిచ్చింది.
అయితే ప్రసవం తర్వాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో శనివారం ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. కాగా కొత్తగూడెంలోని వైద్యుల నిర్లక్ష్యమే కుమారి మృతికి దారితీసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.