
ఖమ్మంవైద్యవిభాగం: ‘వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం.. మందులు పంపిణీ చేస్తున్నాం.. రోగుల విషయంలో నిర్లక్ష్యం వహించే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.’ ఇది సభలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ ఉన్నతాధికారుల నోటి వెంట వచ్చే మాట.. చెప్పేందుకు బాగున్నా.. ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. సేవలేమోకానీ.. ఆస్పత్రుల్లో మందులు మాత్రం సకాలంలో అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ(తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) ద్వారా ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీ లు, సబ్ సెంటర్లకు మందులు సరఫరా చేస్తోంది. ఇంతవరకు సవ్యంగానే ఉన్నా.. ఒకే వాహ నంలో ఉమ్మడి జిల్లాలకు మందులను సరఫరా చేస్తున్నారు. అవి సకాలంలో అందక రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్యుడు రాసిన మందులు ఆస్పత్రులకు సరిగా అందక బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
తపాలా శాఖ ద్వారా రవాణా..
ఉమ్మడి జిల్లాలోని వివిధ ఆస్పత్రులకు తపాలా శాఖ ద్వారా ఔషధ రవాణా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రభుత్వం తపాలా మెయిల్ సర్వీస్ ద్వారా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చి.. వారితో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి తపాలా శాఖ ఏజెన్సీల ద్వారా మందులు ఆస్పత్రులకు సరఫరా అవుతున్నాయి. వాటితోపాటు సర్జికల్, క్లాత్ మెటీరియల్ కూడా పంపిస్తున్నారు. అయితే మందుల సరఫరా కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక్కటే వాహనం కేటాయించటంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఏ పీహెచ్‌సీకి మందులు అందుతాయో తెలియని పరిస్థితి. ఆయా ఆస్పత్రులకు మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు తమకు కావాల్సిన మందుల వివరాలను ఆన్‌లైన్‌లో ఇండెంట్ పెడితే.. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తపాలా మెయిల్ సర్వీస్ వాహనం ద్వారా పంపిస్తున్నారు. ఒకే ఒక్క వాహనం ఉండటంతో ఒకే రూట్‌లో ఉన్న ఆస్పత్రులకు ఒకేసారి పంపిస్తున్నారు. దీంతో అవసరమైనప్పుడు ఆస్పత్రులకు సకాలంలో మందులు అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
‘మారుమూల’కు మరిన్ని ఇబ్బందులు..
మారుమూల ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టు మందుల అవసరం కూడా ఉంటుంది. అయితే సక్రమంగా మందులు సరఫరా కాకపోవటంతో ఆస్పత్రికి వచ్చిపోయే కొందరు రోగులు డాక్టర్ రాసిచ్చిన మందులను ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఫార్మసిస్టులు సొంత ఖర్చుతో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కి వెళ్లి మందులు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మందుల సరఫరాలో మారుమూల ప్రాంతంలోని కరకగూడెం, గుండాల, పినపాక, ఆళ్లపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట పీహెచ్‌సీలకు మందుల కొరత ఎక్కువగా ఉంటోంది. ఆయా ప్రాంతాలకు సరఫరా ఆలస్యమవుతుండటంతో మందులు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక పీహెచ్‌సీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మరికొన్ని వాహనాలను సమకూర్చి ఇబ్బందులను తొలగించాలని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లు, ఫార్మసిస్టులు కోరుతున్నారు.