
ఎన్నికల విధులకు వచ్చి... అత్యాచారం చేశాడు
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల నిర్వహణ కోసం వచ్చిన కానిస్టేబుల్ దుర్గారెడ్డి ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దాంతో బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో దుర్గారెడ్డి ఎన్నికలు విధులు నిర్వహిస్తున్నాడు. ఆ క్రమంలో ఓ ఆటోను అద్దెకు తీసుకుని గత రెండు రోజులుగా పెట్రోలింగ్ చేస్తున్నాడు.
గత అర్థరాత్రి ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లిన దుర్గారెడ్డి... ఆటో డ్రైవర్ భార్యపై అసభ్యంగా ప్రవర్తించి... అత్యాచారం జరిపాడు. దాంతో ఆటో డ్రైవర్ భార్య ఆ విషయాన్ని బంధువులకు తెలిపింది. దాంతో ఆటో డ్రైవర్ భార్యతోపాటు బంధువులు త్రిపురారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ రోజు స్థానిక ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో తర్వాత చుద్దామని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో ఆటో డ్రైవర్ భార్య ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో చేసేది లేక పోలీసులు దుర్గారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.