
పెళ్లికి నిరాకరించాడని..
వేములపల్లి (నల్లగొండ): వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. కులాలు అడ్డుగోడలయ్యాయో.. మరే కారణమో తెలియదు కానీ.. ప్రియుడు చేసిన బాసలు మరిచిపోయాడు.. పెళ్లికి నిరాకరించాడు.. అతడిని ఒప్పించేందుకు ఆ యువతి చేయని ప్రయత్నమంటూ లేదు.. ప్రాథేయపడింది.. కనికరించలేదు.. పెద్దల ఎదుట తనగోడు వెళ్లబోసుకుంది.. ఫలితం లేదు.. చివరకు పోలీస్‌స్టేషన్ గడప కూడా ఎక్కింది.. శూన్యమే కనిపించింది.. మనస్తాపానికి గురై చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. ఇది తెలిసి భయంతో ప్రియుడు కూడా పురుగులమందు తాగాడు.. సంచలనం సృష్టించిన ఈ ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది.
పోలీసులు, గ్రామస్తులు, ప్రేమికుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెదమాం లచ్చయ్య, రాములమ్మ దంపతుల పెద్దకుమార్తె రమణ, ఇదే గ్రామానికి చెందిన వెంకన్న,మంగమ్మల చివరి సంతానం విఘ్నేష్ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పదో తరగతి వరకు చదివారు. విఘ్నేష్ వ్యవసాయ పనులు చూసుకుంటుండగా, రమణ కూలీగా చేస్తోంది. మూడేళ్ల క్రితం విఘ్నేష్ వ్యవసాయ బావి వద్ద కూలికి వెళ్లిన రమణకు విఘ్నేష్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు.
కులాలు అడ్డుగోడలయ్యాయా..?
విఘ్నేష్, రమణల కులాలు వేరు. అయినా ఇద్దరు కలిసిమెలసి తిరిగారు. బాసలు చేసుకుని పెళ్లాడాలనుకున్నారు. విషయం పెద్ద వాళ్లకు కూడా తెలిసింది. ఏమైందో తెలియదు కానీ విఘ్నేష్ పెళ్లికి నిరాకరించాడు. కొద్ది రోజులుగా వీరి పెళ్లి విషయమై గ్రామంలో పంచాయితీ కూడా జరుగుతోంది. అయినప్పటికీ విఘ్నేష్ పెళ్లికి ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో రమణ సోమవారం వేములపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే విఘ్నేష్ తరఫు బంధువులు కేసు నమోదు కాకుండా, రెండు రోజుల సమయమిస్తే గ్రామంలోనే మాట్లాడుకుంటామని, పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇచ్చినట్టు సమాచారం.
న్యాయం జరగదనేనా..?
పెద్ద మనుషుల పంచాయితీలో విఘ్నేష్ పెళ్లికి ఒప్పుకోకపోవడం, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై రమణ ఇంట్లోనే గుళికలు తిన్నట్టు తెలుస్తోంది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన రమణను కుటుంబ సభ్యులు గమనించి మిర్యాలగూడ ఆస్పత్రిలో చేర్పించారు.
భయంతో ప్రియుడు..
రమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విషయం తెలియడంతో విఘ్నేష్ భయాందోళనకు గురయ్యాడు. ఇంట్లోనే ఇతడు కూడా పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. రమణ ఫిర్యాదు మేరకు విఘ్నేష్‌పై మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌గోనె పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.