
ఖైరతాబాద్ ఆర్టీఏలో మహిళల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్..
సాక్షి, హైదరాబాద్: రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ)లో మహిళలకు ప్రత్యేక సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం మహిళలకు డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్, లెర్నింగ్ లైసెన్స్‌లు, వాహ నాల రిజిస్ట్రేషన్‌లు, ఇతరత్రా పౌరసేవలను ప్రత్యేక కౌంటర్‌ల నుంచే అందజేశారు. ఈ కేంద్రాల్లో మహిళా ఉద్యోగులు మాత్రమే విధుల్ని నిర్వహించడం విశేషం.
ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లెర్నింగ్ లైసెన్స్ మేళాకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన ఆర్టీఏ కేంద్రాల్లో మహిళలకు ఇకనుంచి ప్రత్యేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహిళల కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీఏ ప్రత్యేక ఏర్పాట్ల పట్ల మహిళా వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు.