యువతిపై యాసిడ్ దాడి
Published Sat, Nov 8 2014 2:42 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
నిర్మల్: తెలంగాణలో మహిళల భద్రతకు ‘షీ’, ‘హెల్ప్‌డెస్క్’ వంటి వాటితో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. యువతులపై దాడులు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లికి నిరాకరించిందంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో యువతిపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన గజ్జెల హంసపై కడెం మండల కేంద్రానికి చెందిన మునీర్ యాసిడ్‌దాడికి పాల్పడ్డాడు. బీఈడీ పూర్తి చేసిన హంసకు ఐదేళ్లుగా మునీర్‌తో పరిచయం ఉంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా నర్సాపూర్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా నిర్మల్ బస్టాండ్ సమీపంలో మునీర్ తారసపడ్డారు. ఈ క్రమంలో వారి పెళ్లికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. తనను పెళ్లి చేసుకునేందుకు జాప్యం చేస్తోందనే అక్కసుతో మునీర్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై చల్లాడు.
దీంతో ఆమె ముఖానికి, తలకు, భుజానికి తీవ్ర గాయాల య్యాయి. దీంతో వెంటనే ఆమెను నిర్మల్‌లోని ఓ ప్రైవే టు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడు మునీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. మునీర్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ మాధవరెడ్డి విలేకరులతో తెలిపారు. మునీర్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
Advertisement
Advertisement