
నాలునెలల పసిగుడ్డును ఎత్తుకుని విలపిస్తున్న తండ్రి వంశీక్రిష్ణ. ఇన్‌సెట్‌లో..వెంగల మమత(ఫైల్)
- మృతురాలు జెన్‌కోలో ఏఈ
కరీమాబాద్: ఆమె విద్యావంతురాలు.. సమాజంలో ఆడపిల్ల విలువ తెలిసిన వ్యక్తి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది కూడా.. అయినా ఆడపిల్ల పుట్టిందనే మనోవేదన ఆమెను బతకనివ్వలేదు. కొడుకు పుడతాడనుకుని ఆశించిన ఆ తల్లి పేగు కనీసం ఆడబిడ్డకు పాలివ్వడానికి కూడా సహకరించలేదు. చివరికి ఆ ఆడబిడ్డను తల్లిలేని బిడ్డను చేసి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది.
వరంగల్ జిల్లా భూపాలపల్లి జెన్‌కోలో ఏఈగా పని చేస్తున్న వెంగల మమత(31)కు నాలుగు నెలల క్రితం మొదటి సంతానంగా పాప పుట్టింది. కొడుకు పుడతాడనుకుంటే.. పాప పుట్టిందని అప్పటి నుంచి మమత మనోవేదనకు గురైంది. అంతేకాకుండా పాలు రాకపోవడంతో సైకోలా మారింది. పాప పుట్టిన నాటి నుంచి జిల్లా కేంద్రంలోని కరీమాబాద్ ప్రాంతంలోని తల్లిగారింటి వద్దే ఉంటున్న మమత మంగళవారం సాయంత్రం ఇంట్లోకి వెళ్లి పడుకుంటానని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. భర్త వంశీకృష్ణ కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.