మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మేళ్లచెర్వు మండలం చింతిర్యాల గ్రామానికి చెందిన శిరీష(23)కు త్రిపురారం మండలం బొర్రాయిపల్లి గ్రామానికి చెందిన రవికిరణ్ రెడ్డితో పది నెలల క్రితం వివాహమైంది. రవికిరణ్‌రెడ్డి మిర్యాలగూడ సమీపంలోని రెడ్డిల్యాబ్స్‌లో పనిచేస్తున్నాడు. వారు ఇటీవలే మిర్యాలగూడలో కాపురం పెట్టారు. గురువారం ఉదయం రవికిరణ్‌రెడ్డి విధులకు వెళ్లగా శిరీష ఒక్కటే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం పొరుగింటి వారు చూడటంతో శిరీష ఇంట్లో కిటికీకి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆమె మృతిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.