ఆదిలాబాద్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగులు ఆడిపాడారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూల బతుకమ్మ కార్యక్రమంలో జిల్లాలోని రెవెన్యూ, ఐసీడీఎస్, సీపీవో, తదితర శాఖల మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
ఉత్సవాలను పర్యవేక్షించేందుకు, కుల మతాలకతీతంగా (సాధికారికంగా) బతుకమ్మ వేడుక జరిగేలా రాష్ట్ర మహిళా సంఘం నాయకులు జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, ఐసీడీఎస్ పీడీ మీరాబెనర్జీ, టీఎన్జీవో కార్యదర్శి వనజారెడ్డి, మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఫ్రొఫెసర్ సత్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను అధికారికంగా నిర్వహిస్తున్నందున పర్యవేక్షణ కు తనతోపాటు మరో నలుగురు మహిళా నాయకులు వచ్చారని తెలిపారు.
‘ఆడపిల్లల్ని బతికించుకుందాం.. ఆడపిల్లల్ని చదివించుకుందాం’.. అనే కొత్త నినాదంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అన్ని రంగాల్లో ఆడపిల్లలు వెనుకబడి ఉన్నారని, సాధికారిత సాధించాలని ఆకాంక్షించారు. అన్ని శాఖల మహిళా ఉద్యోగులు రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు బతుకమ్మ ఆడాలని టీఎన్జీవో జిల్లా కార్యదర్శి వనజారెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు, చప్పట్లతో హోరెత్తించారు. కలెక్టరేట్ ఆవరణ పండుగలా మారింది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు మల్లీశ్వరి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అనితారెడ్డి, మెప్మా పీడీ రాజేశ్వర్, సరిత, కవిత, మమత, సుజాత, లక్ష్మి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
సాధికార బతుకమ్మ
Published Fri, Sep 26 2014 1:49 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement