- పాములపర్తి గ్రామ మహిళల తీర్మానం
- ఎస్‌ఐకి తీర్మాన ప్రతి అందజేత
వర్గల్: ఆబ్కారీ శాఖ అలసత్వం, పోలీసుల ఉదాసీనం వెరసి గ్రామాల్లో బెల్టు షాపులు పెరిగిపోవడంతో వాటి భరతం పట్టేందుకు నారీమణులు నడుం బిగించారు. వాటిని మూసి వేయించేందుకు నాలుగు రోజులుగా దుకాణాలపై దాడులు చేస్తున్నారు. అంతేకాదు షాపులు నిర్వహిస్తే బెల్టు తీస్తామని హెచ్చరిస్తున్నారు. దుకాణాల నిర్వాహకుడికి 50 చెప్పు దెబ్బలంటూ ఏకంగా తీర్మానం చేశారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని పోలీసులకు అందజేశారు.
మండల పరిధిలోని పాములపర్తి గ్రామ మహిళలు బెల్టు షాపులకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా ఉద్యమ బాట పట్టారు. వాటిపై దాడి చేసి మద్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై బుధ, గురువారాల్లో ఆ శాఖ బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. అయినా మహిళలు ఊరుకోకుండా బెల్టు షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని తమ గ్రామానికి వచ్చిన పోలీసు అధికారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మ్యాకల చంద్రకళ, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్న రాజేష్ మాట్లాడుతూ గ్రామంలో ‘బెల్ట్’ దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తే 50 చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు తమకు సహకరించాలని గౌరారం ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డికి తీర్మాణ ప్రతిని అందజేసినట్లు తెలిపారు.
మద్యం విక్రయిస్తే చెప్పు దెబ్బలే
Published Sat, May 2 2015 12:30 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM
Advertisement