ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన టార్పాలిన్లు, కాంటాలు, తేమయంత్రాల కొనుగోలు బాధ్యతను స్వయంసహాయక సంఘాలకు కేటాయించడం ఐకేపీ(ఇందిరాక్రాంతి పథం) ఉద్యోగులకు వరంగా మారింది. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. డీఆర్‌డీఏ మార్గదర్శకాలకు విరుద్ధంగా నాసిరకం వస్తు సామగ్రిని సీజన్ దాటిన తరువాత కొనుగోలు చేసి సంఘాలకు అంటగట్టి సొమ్ముచేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
నీలగిరి :గత రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 250 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ప్రారంభానికి ముందు కొనుగోలు చేయాల్సిన టార్పాలిన్లు, ఇతర వస్తుసామగ్రిని సీజన్ ముగింపు దశకు చేరినప్పుడు కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకమైన వాటిని కొనుగోలు చేసి సంఘాలకు అంటగట్టారు. వాస్తవానికి మహిళా సంఘాలు స్వయంగా బహిరంగ మార్కెట్లో వాటిని కొనుగోలు చేయాలి. కానీ పలు మండలాల్లో ఏపీఎంలు, ఏసీలు జోక్యం చేసుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి కొన్నట్లు తెలిసింది.
క మీషన్ దుర్వినియోగం...
ధాన్యం కొనుగోలు తర్వాత మహిళా సంఘాలకు ఇచ్చే కమీషన్‌లోనుంచి కొంతడబ్బు వెచ్చించి టార్పాలిన్లు కొనుగోలు చేయాలి. ఇలా నాన్ ఆయకట్టు పరిధిలో ఏర్పాటు చేసిన 15 కేంద్రాలుఎక్కువ మొత్తంలో టార్పాలిన్లు కొనుగోలు చేశాయి. వీటిలో ఎక్కువ భాగం వలిగొండ, పోచంపల్లి, తిప్పర్తి, రామన్నపేట, ఆలేరు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 1656 టార్పాలిన్లు కొన్నారు. వీటితో పాటు కాంటాలు12, స్కేళ్లు 35 కొన్నారు. ఒక్కో టార్పాలిన్‌కు డీఆర్‌డీఏ నిర్ధారించిన ధర రూ.2,450. ఈ లెక్కన టార్పాలిన్‌ల కొనుగోలుకు సుమారు రూ.40,57,200 కేటాయించారు. కానీ పలు మండలాల్లో నిర్ధారించిన ధరకు అదనంగా రూ.130 వెచ్చించి కొన్నారు. ని ర్ధారించిన ధరల ప్రకారం నిర్ణీత ప్రమాణాలు కలిగిన సామగ్రి మాత్రమే కొనుగోలు చేయాలని డీఆర్‌డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఏ ఒక్క మార్గదర్శకాన్ని పాటించలేదు.
టార్పాలిన్ల విషయానికొస్తే..
ఐదు లేయర్లు మందం కలిగి, నలుపు రంగులో ఉండాలి. పొడవు 8 మీటర్లు, అడ్డం 6 మీటర్లు ఉండాలి. కానీ పోచంపల్లి మండలానికి వచ్చిన టార్పాలిన్లు పరిశీలిస్తే మాత్రం 6 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల పొడవు ఉన్నాయి. ధర కూడా అధికమే. పట్టాలు నాసిరకంగా ఉన్నాయి.
పట్టింపులేని యంత్రాంగం..
ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన టార్పాలిన్లు, ఇతర సామగ్రి వైపు అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. నాణ్యతా ప్రమాణాలు పాటించారా..?లేదా? అనేది కూడా పరిశీలన చేయలేదు. గతంలో మార్కెటింగ్ శాఖ నుంచే ఐకేపీ కేంద్రాలకు టార్పాలిన్లు, తేమ యంత్రాలు పంపిణీ చేసేవారు. కానీ ఈసారి కొనుగోలు బాధ్యతను సంఘాలకు అప్పగిండచం వల్ల ఐకేపీ ఉద్యోగులకు ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికైన అధికారులు స్పందించిన నాణ్యతా ప్రమాణాలపై పూర్తి విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగు వస్తాయని సంఘాలు కోరుతున్నాయి. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే మౌలిక వసతులప్పుడైనా కనీసం జాగ్రత్తలు పాటించేందుకు వీలుంటుంది.
మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 250
టార్పాలిన్లు కొన్న కేంద్రాలు : 15
మొత్తం టార్పాలిన్లు : 1656
కేటాయించింది : రూ.40,57,200
ఒక్కో టార్పాలిన్‌కు నిర్ధారించిన ధర : రూ.2450
సిబ్బంది కొనుగోలు చేసింది : రూ.2580
అదనంగా చెల్లించింది : రూ.130
మొత్తంగా ఖర్చు చేసింది :
42,72,480
(మహిళా సంఘాల కమీషన్‌లోనుంచే టార్పాలిన్లకు
డబ్బు కేటాయించారు)
మహిళా సంఘాలకు టోపీ
Published Mon, Oct 6 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement