స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. తనదైన నటన, అందం, అభినయంతో చాలా తక్కువ కాలంలోనే ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న చక్కటి నటి సాయి పల్లవి. కేవలం నటనకు మాత్రమే కాకుండా, సినిమాల కథలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆమె ప్రత్యేకత. ఒక విధంగా చెప్పాలంటేనే ఈ వైఖరే సాయి పల్లవికి నటిగా గౌరవనీయమైన స్థాయిని అందించింది. పాత్ర ఏదైనా సహజంగా ఆ పాత్రలో ఒదిగి పోవడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. అంతేకాదు నాట్యంలో కూడా నాట్య మయూరి అనిపించుకుంది.
బడగ తెగకు చెందిన సాయి పల్లవి
ఫిదాలో అల్లరి అమ్మాయిగా ఫిదా చేసింది. ప్రేమమం మొదలు తెలుగులో నటించిన లవ్ స్టోరీలో సారగ దరియా అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా విరాటపర్వంలో డీగ్లామరైజ్డ్ పాత్రలో పేదల కష్టాలపై పోరాడే అన్నల ఆకర్షితురాలైన యువతిగా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలో దేవదాసిగా సాయి పల్లవి నటన నభూతో నభవిష్యతి. ఏ పాత్రనైనా అవలీలగా నటించడం ఆమెకు తెలుసు. అయితే సాయి పల్లవి తమిళనాడులో నీలగిరి పర్వత ప్రాంతానికి చెందిన బడగ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి సాయి పల్లవి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది పల్లవి. అసలు ఏంటీ బడగ జాతి ఈ వివరాలు చూద్దాం.
#WATCH | Tamil Nadu: A large number of devotees participate in the Hethiyamman temple festival, in Nilgiris. pic.twitter.com/jLBINIdul9
— ANI (@ANI) January 1, 2024
బడగా, అంటే అర్థం 'ఉత్తరం. పాత కన్నడ బడగానా నుంచి వచ్చింది. బడగాలపై పరిశోధన దాదాపు ఆరు దశాబ్దాలపాటు పరిశోధించిన అమెరికన్ మానవ శాస్త్రవేత్త పాల్ హాకింగ్స్ ప్రకారం సుల్తానుల హింసనుంచి పారిపోయి మైసూర్ మైదానాల నుండి వలస వచ్చిన వొక్కలిగాలుగా భావిస్తారు. నీలగిరి జిల్లాలో దాదాపు 400 గ్రామాలలో బడగలు నివసిస్తున్నారట. బడగలు బడగా అనే భాషను మాట్లాడతారు. దాదాపు ఇది కన్నడ భాషకు దగ్గరగా ఉంటుంది. కానీ లిపి లేదు. ఇంగ్లీష్, తమిళం, మలయాళం, తెలుగు భాషలతోపాటు బడగ భాషను కూడా సాయి పల్లవి బాగా మాట్లాడుతుంది. బడగలు దాదాపు 400 గ్రామాలలో నివసిస్తున్నారు.
నీలగిరి జిల్లాలో బడగలు అతిపెద్ద ఆదిమ తెగలు. నీలగిరి మొదట గిరిజనుల భూమి.కుకల్, కడనాడ్, ఈతలార్, నుండాల, మేలూరు, హులికల్, అతికరాట్టి, మేల్కుంద, కిల్‌కుంద, కెట్టి, తంతనాడు, మిలిదేను, నందట్టి, జక్కనారి, అరవేను, తిన్నియూర్, అయ్యూరు, కన్నెరిముక్కు, బెరగని, త్వున్నేర్, జక్క, తదితర గ్రామాల్లో వీరు నివసిస్తారు.వీరిని నీలగిరి గౌడలు అని కూడా అంటారు.బడగాలు ప్రాచీన శిలాయుగానికి చెందినవారిగా చరిత్రకారులు భావిస్తారు.
బడగాలు పండుగలను "హబ్బా" అని పిలుస్తారు. బడగాస్ ప్రధాన దేవతలు హెతాయ్ , అయ్య. అలాగే శివుడు, కృష్ణుడు, ఖాలి, మారి, మునియప్పను కూడా పూజిస్తారు. ముఖ్యమైన పండుగలు డెవ్వా హబ్బా, హేతే హబ్బా, సకలతి హబ్బా, ఉప్పట్టువ హబ్బా. గిరిజన తెగ అయిన బడగాలు మా ఖలీ హబ్బా, దేడిసిమి హబ్బా, కృష్ణ జయంతి, వినాయగర్ చతుర్థి, మర్రి హబ్బా, మురుగర్ హబ్బా, రామర్ హబ్బా, హనుమాన్ జయంతి తోపాటు ప్రకృతిని, నీటిని, సూర్యుడు, సర్పాలను ప్రకృతిని పూర్వీకులను కూడా పూజిస్తారు.
ఆదివాసి బడగా పురాతన అగ్ని తయారీ ప్రక్రియ (చెకుముకి రాళ్ల రాపిడి ద్వారా నిప్పు తయారీని) ఇప్పటికీ వారి దేవా పండుగ సమయంలో అవసరమైన ఆచారంగా ప్రదర్శిస్తారు వారు రెండు రాళ్లు లేదా రెండు కర్రలు రుద్దడం ద్వారా రాపిడి ద్వారా అగ్నిని ఉత్పత్తి చేశారు. దీన్ని "నీలిగోలు" లేదా నిటారుగా ఉండే కర్ర అంటారు. శివుని అవతారంగా భావించే సూర్యుడిని,విష్ణువు అవతారంగా నాగప్పను ఆరాధిస్తారు
హేతై హబ్బా
ప్రతి సంవత్సరం డిసెంబరు-జనవరిలో ఒక నెల పాటు హేతై హబ్బాను ఘనంగా జరుపుకుంటారు. తమిళ మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తొలి సోమవారం హేతై హబ్బా వేడుకను నిర్వహిస్తారు. రక్షకురాలిగా , ప్రయోజకురాలిగా విశ్వసించే హేతై అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ పండుగ పచ్చని నీలగిరి ప్రకృతి దృశ్యం నేపథ్యంలో భక్తులు సాంప్రదాయ తెల్లని దుస్తులలో హేతే దేవతను ఆరాధిస్తారు. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది రోజుల పాటు భారీ ఊరేగింపులతో లక్షలాది మంది బడగలు తమ దేవతను కీర్తించేందుకు ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీ. సాయి పల్లవి కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు గతంలో షేర్ చేసింది.
బడగ కమ్యూనిటీనుంచి వచ్చిన ఇతర ప్రముఖులు
బడగ తెగ సంస్కృతి, ఆచారాలతోపాటు విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే 80 శాతం అక్షరాస్యతను కలిగి ఉన్నారు. అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలలో , మరికొందరు విదేశాలలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మాజీ లోక్‌సభ ఎంపీ, దివంగత అక్కమ్మ దేవి. ఆమె డిగ్రీ చదివిన తొలి బడగ మహిళ . 1962 నుండి 1967 వరకు నీలగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక తొలి మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ బెల్లి లక్ష్మీ రామకృష్ణన్ MA ప్రసిద్ధి. ఈమె తొలి మహిళా గెజిటెడ్ అధికారిణి కూడా. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment