సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఆమె ఓటే అభ్యర్థుల తలరాత మార్చేది.. గెలుపు, ఓటములను నిర్దేశించేది.. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల భవితవ్యం మహిళల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. ఎన్నికల ఫలితాలు వారిపైనే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి అతివలకు మాత్రమే ఉంది. అందుకే అన్ని పార్టీలు ‘ఆమె’ను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. హామీలతో తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నాయి.
జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలడంతో ఆయా పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను మహిళలే నిర్ణయించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లా అధికారులు త్వరలో ప్రకటించనున్న తుది జాబితా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. జిల్లాలో మొత్తం 17,77,678 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో మహిళా ఓటర్లు 9,24,331 మంది కాగా, పురుషులు 8,53,204 మంది, మరో 143 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌లో 2,41,424 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అతి తక్కువగా బాన్సువాడ నియోజకవర్గంలో 1,73,226 ఉన్నట్లు తేలింది. జిల్లాలో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అత్యధికంగా బాల్కొండలో మహిళలు
జిల్లాలో అత్యధికంగా బాల్కొండ నియోజకవర్గంలో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 15,596 మంది అధికంగా ఉన్నట్లు తేలింది. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో కూడా పురుషుల కంటే 14,312 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఒక్క జుక్కల్ నియోజకవర్గంలో మాత్రం ఈ వ్యత్యాసం తక్కువగా ఉంది. పురుషుల కంటే స్త్రీలు 1,961 మంది ఎక్కువ ఉన్నారు. డిసెంబర్ 7 తేదీన జరగనున్న పోలింగ్‌లో మహిళలే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment