
వ్యాధులు బాబోయ్!
స్వైన్‌ఫ్లూతో ఒకరు, అతిసారతో మరొకరి మృతి
ఓ వైపు చాపకింద నీరులా విస్తరిస్తున్న స్వైన్‌ఫ్లూ ఒకరిని కబళించేసింది.. అస్వస్థతకు గురైన ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ మృత్యువాతపడ్డాడు. మరోవైపు అతిసార భూతం పంజా విసిరింది.. గద్వాలలో కలుషితనీరు తాగి ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో 11మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ రెండు సంఘటనలు సోమవారం చోటుచేసుకున్నాయి.
చనాగర్‌కర్నూల్ రూరల్: నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన ఎన్నం రాకేష్(33) కొంతకాలంగా ఆత్మకూర్‌లోని వికాస్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. వనపర్తిలోని కేడీఆర్ నగర్‌లోని ఓ అద్దెఇంట్లో నివాసం ఉంటూ ఆత్మకూరుకు రాకపోకలు సాగిస్తున్నాడు. ఇదిలాఉండగా, వారం రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో వనపర్తిలో వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. మెరుగైన వైద్యచికిత్సల కోసం సమీప బంధువు రాకేష్‌ను ఆదివారం హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు.
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించగా స్వైన్‌ఫ్లూగా నిర్ధారణ అయింది. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందాడు. మృతుడికి తండ్రి కృష్ణయ్య, తల్లి జయమ్మ ఉన్నారు. వ్యవసాయం చేస్తూ తమ ఇద్దరి కొడుకులను చదివించారు. ఎమ్మెస్సీ వరకు చదివిన రాకేష్ ఏడాదిన్నర క్రితమే వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా వనపర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. రాకేష్ మృతితో శ్రీరంగాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
పంజావిసిరిన అతిసార
గద్వాలటౌన్: పట్టణంలోని ఒంటెలపేట కాలనీకి చెందిన చాంద్‌పాష(55) రెండురోజులుగా వాంతులు, విరేచనాలకు గురయ్యాడు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. అదే కాలనీలో నివాసముంటున్న షరీఫ్, గౌస్‌మైనుద్దీన్, అన్వర్, సలాంమియా, రిహాన్, షరీఫ్, మెహ్రాజ్‌బేగం, గంజిపేటకు చెందిన గిరి, జమ్మిచేడు గ్రామానికి చెందిన నాగరాజు అతిసార బారినపడ్డారు.
ప్రస్తుతం వీరు గద్వాల ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిలో సలాంమియా, రిహాన్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. ఒంటెలపేట కాలనీలో తాగునీరు కలుషితం కావడం వల్లే స్థానికులు అతిసార బారినపడ్డారని, పైప్‌లైన్లు లీకేజీ కావడంతోనే నీరు కలుషితమైందని మునిసిపల్ అధికారులు గుర్తించారు.
ఎమ్మెల్యే పరామర్శ..
స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ అతిసారబారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. మృతుడు చాంద్‌పాష కుటుంబసభ్యులను ఆమె పరామర్శించి ఓదార్చారు.