విధులకు హాజరవుతామన్న కొందరు..
అడ్డుకున్న మరికొందరు..
కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల పోరు ఉధృతం దాల్చుతోంది. ఇప్పటికే సమ్మె 25 రోజులకు చేరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. కొత్తగూడెంలో మున్సిపల్ కార్యాలయ భవనంపెకైక్కి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు. ఖమ్మంలో అధికార, ప్రతిపక్ష కార్మికుల మధ్య వివాదం తలెత్తింది. తోపులాట వరకు పరిస్థితి వెళ్లడంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఖమ్మం సిటీ : విధుల్లో చేరతామన్న కొందరు కాంట్రాక్టు కార్మికులు, సమ్మెలో ఉన్న కార్మికుల మధ్య వివాదం నెలకొనడంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విధుల్లో చేరేందుకు సిద్ధమైన కార్మికులు నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. సమ్మెలో ఉన్న కార్మికులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వివాదం నేలకొంది. పరిస్థితి తోపులాట వరకు వెళ్లడంతో ఓ మహిళా కార్మికురాలి చేతికి గాయమైంది. చివరకు పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.
పూర్వాపరాల్లోకి వెళ్తే..
టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా కొందరు నగరపాలక కార్మికులు గురువారం కొత్త కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి గౌరవ అధ్యక్షుడిగా మాజీ కౌన్సిలర్, టీఆర్‌ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రాన్ని ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా తాము శుక్రవారం నుంచి విధుల్లోకి వచ్చేందుకు అనుమతించాలని కోరు తూ ఇన్‌చార్జి కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. శీలంశెట్టి ఆధ్వర్యంలో కార్యాలయానికి వచ్చిన సుమారు 30 మంది కార్మికులను సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకునేందుకు యత్నించారు. శీలంశెట్టితో కార్మిక సంఘాల నాయకులు విష్టు, మంద వెంకటేశ్వర్లు వాదనకు దిగారు.
కేవలం జీతాల పెంపు కోసమే సమ్మె చేస్తున్నామని, విచ్ఛిన్నం చేయటం తగదని సమ్మె చేస్తున్న కార్మికులు పేర్కొన్నారు. ఒక వైపు వాదనలు జరుగుతుండగానే విధుల్లోకి హాజరయ్యేందుకు వచ్చిన కార్మికులపై సమ్మె చేస్తున్న కార్మికులు తిట్ల పురాణం అందుకున్నారు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి స్పల్ప తోపులాట చోటుచేసుకుంది. దీనిలో ఒక మహిళ చేతికి గాయం అయింది. దీనిపై సమ్మె చేస్తున్న కార్మిక సంఘం నాయకులు కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కమిషనర్ చాంబర్‌లో బైఠాయించారు.
దీనిపై కమిషనర్ స్పందిస్తూ దాడి చేసిన కార్మికుడిపై రాత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. అతనిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినప్పటికీ వారు ఒప్పుకోలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి బైఠాయించిన కార్మికులను కార్యాలయం నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం తాము విధులకు హాజరవుతామని కొంతమంది కార్మికులు కమిషనర్ వేణుగోపాలరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కార్మికులే స్వచ్ఛందంగా విధులకు హాజరవుతున్నారు
శీలంశెట్టి వీరభద్రం, మాజీ కౌన్సిలర్
కార్పొరేషన్‌లో శానిటేషన్, డ్రింకింగ్, లింకేజీ విభాగంలో పని చేస్తున్న వారందరూ సుమారు 50 మంది స్వచ్ఛందంగా విధులకు హాజరవుతున్నారు. ఇందులో ఎవరి ప్రోద్బలం లేదు. వారంతట వారుగా హాజరైతే సమ్మె చేస్తున్న వారికి ఇబ్బంది ఏమిటి? వారంతా శుక్రవారం విధులకు వస్తారు.
సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర
విష్ణ, సీఐటీయూ నాయకులు
కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని 25 రోజు లుగా సమ్మె చేస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు కవ్విం పు చర్యలకు దిగుతున్నారు. ఇలాంటి చర్యలను సహిం చేది లేదు. ఎవరైనా విధులకు హాజరైతే అడ్డుకొని తీరుతాం. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకే ఇలాంటి కుట్రలు.
కార్మికుల ‘పోరు’
Published Fri, Jul 31 2015 3:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement