
బుధవారం జీఈఎస్‌లో భాగంగా జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడుతున్న ఇవాంకా ట్రంప్. చిత్రంలో చెర్రీ బ్లెయిర్, డెల్ కంప్యూటర్స్ చీఫ్ కన్సూ్యమర్ ఆఫీసర్ కెరెన్ క్వింటాస్, ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్ చందా కొచ్చర్, మంత్రి కేటీఆర్
సమాజంలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తేనే సరిపోదని.. పురుషులూ తమ వంతు పాత్ర పోషించడం కూడా అవసరమేనని బుధవారం గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ దిగ్గజ మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మహిళలు మరింత ఎక్కువ మంది భాగమవడం ఆర్థిక అభివృద్ధిని పెంచే విషయమన్నారు. ఈ దిశగా మహిళలకు పెట్టుబడులను అందుబాటులో ఉంచడంతోపాటు తగిన నైపుణ్యాలు అందించడం, విద్యా, ఉపాధి, మార్గదర్శక అవకాశాలు కల్పించడం తప్పనిసరని, ఈ బాధ్యత ప్రభుత్వాలదే కాకుండా.. కుటుంబాల్లోని పురుషులపైనా ఉందన్నారు. ‘ఇన్నొవేషన్స్ ఇన్ వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్’ అంశంపై జరిగిన చర్చలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, డెల్ కంప్యూటర్స్ చీఫ్ కన్సూ్యమర్ ఆఫీసర్ కెరెన్ క్వింటాస్, ఐసీఐసీఐ బ్యాంకు చైర్ పర్సన్ చందా కొచ్చర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమన్వయకర్తగా వ్యవహరించారు.
– సాక్షి, హైదరాబాద్
స్త్రీలకు సమాన అవకాశాలివ్వాలి:ఇవాంకా
పురుషులు, మహిళలకు సమాన ఉద్యోగ అవకాశాలివ్వడం కంపెనీల సామాజిక బాధ్యత మాత్రమే కాదని, ఆర్థికంగానూ ప్రయోజనకరమని ఇవాంకా ట్రంప్ తెలిపారు. కేటీఆర్ అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ మహిళలు నడుపుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడుల లభ్యత అమెరికాలో కేవలం 3 శాతం మాత్రమే ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక పథకం ద్వారా ఈ లోపాన్ని సవరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. ‘‘కుటుంబ బాధ్యతల్లో పురుషులు చురుకుగా పాల్గొనరన్నది పాత తరానికి చెందింది. కొత్త తరం పురుషులు, మహిళల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఉద్యోగాలు చేసేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు మహిళలూ ఉత్సాహం చూపుతుండగా.. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ బాధ్యతలు చూసుకునే పురుషుల సంఖ్య కూడా పెరుగుతోంది’’అని ఇవాంకా ట్రంప్ తెలిపారు.
భాగస్వామ్యం పెరుగుతోంది: చందా కొచ్చర్
మహిళలకు పనిలో భాగస్వామ్యం కల్పించే విషయంలో భారత్ మిగిలిన వాటి కంటే మెరుగైన స్థితిలో ఉందని ఐసీఐసీఐ బ్యాంకు చైర్‌పర్సన్ చందా కొచ్చర్ తెలిపారు. పది కోట్ల మంది మహిళా స్వయం సేవక సంఘాల సభ్యులే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళలు వంటింటికే పరిమితమన్న భావన తొలగి అనేక రంగాల్లో వారు ప్రతిభ చాటుకుంటున్నారని చెప్పారు. ఒక దేశ బ్యాంకింగ్ రంగంలో 40 శాతం మంది మహిళలు ఉండటం ఒక్క భారతదేశానికి మాత్రమే చెల్లిందని కొచ్చర్ చెప్పారు. పురుషులు, మహిళల మధ్య అంతరాన్ని మరింత తగ్గిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తికి మరో 7,000 కోట్ల డాలర్లు చేర్చవచ్చునని మెకిన్సే అధ్యయనం చెప్పడాన్ని కొచ్చర్ గుర్తుచేశారు.
సగం మందికి ఇల్లే ఆఫీసు: కెరెన్ క్వింటాస్
డెల్ కంప్యూటర్స్‌లో పని చేసే మహిళల్లో సగం మంది ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారని, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా కంపెనీ వారికి ఈ అవకాశం కల్పిస్తోందని సంస్థ చీఫ్ కన్సూ్యమర్ ఆఫీసర్ కెరెన్ క్వింటాస్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు డెల్ అనేక చర్యలు చేపట్టిందని, పెట్టుబడులతోపాటు మార్గదర్శకత్వం వహించేందుకు, బిగ్ డేటా, ఆర్టి్టఫిషియల్ ఇంటెలిజెన్స్‌లతో వారికి సాయపడేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఉద్యోగాల్లో, పరిశ్రమల స్థాపనలో పురుషులు, మహిళల మధ్య ఉన్న అంతరం తగ్గితే ఆ యా దేశాల స్థూలజాతీయోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థ మెకెంజీ అధ్యయనం స్పష్టం చేసిన విషయాన్ని కెరెన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మహిళల సామర్థ్యం వృథా అవుతోంది: చెర్రీ బ్లెయిర్
భారత్‌లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తక్కువగా ఉన్నారని, వారిలోనూ చాలా మంది పెళ్లిళ్ల తరువాత ఉద్యోగాలు మానేస్తున్నారని, ఈ పరిణామాన్ని మహిళలు వారి సామర్థ్యాన్ని వృథా చేస్తున్నట్లుగానే చూడాలని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు అయిన యువతులతోపాటు లేటు వయసులో మళ్లీ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేలా చెర్రీ బ్లెయిర్ ఫౌండేషన్ తరఫున శిక్షణ ఇస్తున్నామన్నారు.
మరో పదేళ్ల తర్వాత...
మరో దశాబ్దం తరువాత మహిళలు ఎలా ఉండా లని కోరుకుంటున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించగా ఆంక్షలు పెట్టే సమాజం ఉండకూడదని ఆడపిల్లల తల్లులుగా తాము కోరుకుంటున్నామని ఇవాంకా ట్రంప్ బదులిచ్చారు. మహిళలు చేసే పనులు పురుషులు చేయడం, పురుషులకే పరిమితమైన పనులను మహిళలు చేయడం మరింత పెరగాలని ఆకాంక్షించారు. మహిళలకు విద్య, ప్రోత్సాహం, సాధికారత అందాలన్నది తన ఆకాంక్ష అని చందా కొచ్చర్ పేర్కొనగా ఆడపిల్లలు తమకు తగిన వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకునే స్వేచ్ఛ అందాలని కోరుకుంటున్నట్లు చెర్రీ బ్లెయిర్ తెలిపారు.
గ్రామాలకు స్వచ్ఛ ఇంధనం: అజైతా షా
ఇంధనం, మౌలిక రంగ విభాగానికి సంబంధించిన పిచ్ కాంపిటీషన్‌లో స్టార్టప్ సంస్థ ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’విజేతగా నిలిచింది. సోలార్ టెక్నాలజీ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన ఇంధన వనరులను గ్రామీణ ప్రాంతాల మహిళలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఫ్రాంటియర్ మార్కెట్స్‌ని ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకురాలు అజైతా షా ‘సాక్షి’బిజినెస్ బ్యూరోతో చెప్పారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్ సాయంతో వాటిని అందజేస్తున్నట్లు తెలిపారు. రాజస్తాన్‌లో దాదాపు నాలుగు వేల మంది మహిళలకు సోలార్ టెక్నాలజీ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని, తద్వారా వెయ్యి మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆదాయ మార్గాలు కూడా చూపించగలిగామని వెల్లడించారు. ‘‘మహిళలపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే లాభాలను నేను చూశా. దీనిని అందరికీ చూపొ చ్చని జీఈఎస్‌కు వచ్చి.. పిచ్ కాంపిటీషన్‌లో పాల్గొన్నాను. నా లక్ష్యం అందరికీ నచ్చి, నేను గెలవటం సంతోషం కలిగించింది. ప్రస్తుతం రాజస్థాన్‌కే పరిమితమైనా.. త్వరలో మరో 6 రాష్ట్రాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్స్ సంఖ్యను వెయ్యి నుంచి పదివేలకు పెంచాలని భావిస్తున్నాం’’అని అజైతాషా వివరించారు. తమ సంస్థను ప్రారంభించి ఆరేళ్లవుతోందని, గతంలో కొంత పెట్టుబడులు సమీకరించామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఇప్పటిదాకా ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా సమీకరించామని.. 2020 నాటికల్లా 26 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేలా మరో 2 మిలియన్ డాలర్లు సమీకరించనున్నామన్నారు.
‘పిచ్’ విజేతలు అజైతా, జైనేశ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈఎస్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ (జిస్ట్) పిచ్’కాంపిటీషన్‌లో బుధవా రం రెండు విభాగాల్లో తుది విజేతలను ప్రకటించారు. ఫిన్‌టె క్–డిజిటల్ ఎకానమీ, ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో ఆరు చొప్పున 12 స్టార్టప్ సంస్థలు పోటీపడ్డాయి. వాటిల్లో ఫిన్‌టెక్ విభాగంలో విద్యా రుణాల సదుపాయం కల్పించే జ్ఞాన్‌ధన్ సంస్థ, ఎనర్జీ విభాగంలో ఫ్రాంటియర్ మార్కె ట్స్ సంస్థ విజేతలుగా నిలిచాయి. గురువారం మరో రెండు (హెల్త్‌కేర్–లైఫ్‌సైన్సెస్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్) విభాగాల్లో తుది విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ఈ 4 విభాగాల్లో ఎంపికైన వారి నుంచి తుది విజేతను ఎంపిక చేస్తారు. విభాగాల వారీ విజేతలకు సుమారు రెండు లక్షల డాలర్ల మేర బహుమతి అందజేస్తారు. తుది విజేతకు నాలుగు లక్షల డాలర్లు ఇస్తారు. బుధవారం రెండు విభాగాల్లో విజేతలు ఫ్రాంటియర్ మార్కెట్స్ వ్యవస్థాపకులు అజైతాషా, జ్ఞాన్‌ధన్ వ్యవస్థాపకులు జైనేశ్ సిన్హా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
రెండు రోజుల్లో రుణాలు: జైనేశ్ సిన్హా
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న జ్ఞాన్‌ధన్ స్టార్టప్ సంస్థ ఫిన్‌టెక్ విభాగంలో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా జ్ఞాన్‌ధన్ సంస్థ వ్యవస్థాపకులు జైనేష్ సిన్హా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘‘మంచి చదువు, మంచి కాలేజీ, మంచి ఉద్యోగం.. ఏ విద్యార్థిౖ కెనా ఇదే కల. విదేశాల్లో అందులోనూ టాప్ వర్సిటీల్లో చదవాలని అనుకుంటారు. కానీ చాలా మందికి ఇది కలగానే మిగిలిపోతుంది. కారణం డబ్బు సమస్య. బ్యాంకులు విద్యా రుణాలు ఇస్తున్నా.. అంత సులువేమీ కాదు. తనఖా నుంచి మొదలు పెడితే వడ్డీ రేట్ల వరకూ ప్రతీది సమస్యే. దీనికి మేం ‘జ్ఞాన్‌ధన్’తో పరిష్కారం చూపిస్తున్నాం. ఐఐటీ చదివే రోజుల్లో డబ్బు కోసం మాకు ఎదురైన ఇబ్బందులే ఈ స్టార్టప్ ప్రారంభానికి పునాది వేశాయి. అంకిత్ మెహ్రాతో కలసి దీన్ని ప్రారంభించా. రుణాల కోసం ఎస్‌బీఐ, బీఓబీ, యాక్సిస్ బ్యాంకులతోపాటు ఒక ఎన్‌బీఎఫ్‌సీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. జ్ఞాన్‌ధన్‌లో తనఖాతో, తనఖా లేకుండా రెండు రకాల విద్యా రుణాలుంటాయి. రూ.10 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు రుణాలు అందిస్తాం. తనఖాతో కూడిన రుణానికైతే 2–3 వారాలు, తనఖా లేకుండా అయితే 2 రోజుల్లో రుణం అందిస్తాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 600 మంది విద్యార్థులకు రూ.160 కోట్ల రుణాలను అందించాం. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి 100 మంది విద్యార్థులున్నారు’’అని జైనేశ్ సిన్హా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment