ముగిసిన పరామర్శ యాత్ర
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర శుక్రవారం ముగిసింది. ఈనెల 8న జిల్లాలో ప్రారంభమైన ఈయాత్రలో షర్మిల 22 కుటుంబాలను కలుసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ హఠాన్మరణంతో గుండె చెదిరి మరణించిన నాలుగు కుటుంబాలను పర్యటనలో చివరిరోజు శుక్రవారం ఆమె పరామర్శించారు. గురువారం రాత్రి కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో బసచేసిన షర్మిల శుక్రవారం ఉదయం పరామర్శయాత్రను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా పరిగి మీదుగా కొందుర్గు మండలం పెద్దఎల్కిచెర్లకు చేరుకుని సుంకరి కిష్టమ్మ కుటుంబాన్ని పరామర్శించి యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు.
అనం తరం బాలానగర్ మండలం గుండ్లపొట్లంపల్లిలో ఆకుల శంకరయ్య కుటుంబాన్ని కలుసుకుని షాద్‌నగర్‌కు చేరుకున్నారు. షాద్‌నగర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పూలమాల వేసి షర్మిల నివాళి అర్పించారు. పోటెత్తిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆమెప్రసంగించారు. అనం తరం కొత్తూరు మండలం నర్సప్పగూడలో పెంటమీది ఆండాలు, మల్లాపూర్‌లో పిన్నింటి నాగిరెడ్డి కుటుంబాన్ని షర్మిల పరామర్శిం చారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలో ఐదురోజుల పరామర్శ యాత్ర ముగించుకుని జాతీ య రహదారి మీదుగా హైదరాబాద్‌కు షర్మిల బయలుదేరి వెళ్లారు.
చివరిరోజు జనజాతర
షర్మిల పరామర్శయాత్ర చివరిరోజు పెద్ద ఎత్తున జనం తరలొచ్చింది. ప్రతిచోటా వైఎస్ కూతురును చూసేందుకు జనం బారులుతీరారు. పెద్ద ఎల్కిచర్ల,గుండ్లపొట్లంపల్లి, నర్సప్పగూడ, మల్లాపూర్, షాద్‌నగర్‌లో షర్మిలను చూసేందుకు గ్రామస్తులు పెద్దఎత్తున కదిలొచ్చారు. పరామర్శయాత్రలో జనం పెద్దఎత్తున గుమికూడి స్వాగతం పలికారు. కొందుర్గు మండలం లాల్‌పహాడ్ నుంచి భారీ వాహన శ్రేణితో వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు షర్మిల పరామర్శయాత్రను అనుసరించారు.
మామిడి శ్యాంసుందర్‌రెడ్డి ఘనస్వాగతం పలి కారు. బాణాసంచా, డప్పు చప్పుళ్ల నడుమ యాత్ర సాగింది. తనపై జిల్లా ప్రజానీకం చూపిన అభిమానానికి షర్మిల ఉద్వేగం వ్యక్తం చేశారు. పరామర్శ యాత్ర చివరి రోజు వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు వైఎస్ అభిమానులు, అన్ని జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నాయకులు తరలొచ్చారు. పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, భగవంతురెడ్డి తదితరులు ఐదు రోజుల పాటు పరామర్శ యాత్రను నిర్విరామంగా అనుసరించారు. పరామర్శ యాత్ర జరిగిన తీరుపై పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.