సాక్షి, హైదరాబాద్: కరువుపీడిత యాదాద్రి భువ నగిరి జిల్లాకు వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు జలాలందుతాయని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల నిర్మాణపనులను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని, ఏజెన్సీలను ఆదేశించారు. యాదాద్రి జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ 15, 16 పనులను గురువారం జలసౌధలో సమీక్షించారు. గంధమల రిజర్వాయర్ పూర్తికాకపోయినా డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రం పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తే, వాటి ద్వారా 100 చెరువులు నింపి యాదాద్రి జిల్లాలో కనీసం 21 వేల ఎకరాలకు సాగునీరివ్వొచ్చని చెప్పారు.
ఇంకా కృషి చేస్తే దాదాపు 40 వేల ఎకరాలకు కూడా సాగునీరిచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ డిస్ట్రిబ్యూటరీల కోసం వారం, పది రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు, స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గంధమల్ల చుట్టుపక్కల ఎన్ని గొలుసుకట్టు చెరువులున్నాయి.. ఎంత ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చో వెంటనే వివరాలివ్వాలని సూచించారు. మల్లన్నసాగర్ నుంచి గంధమల్ల వరకు 35 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వవిప్ గొంగిడి సునీతారెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఈఎన్‌సీ మురళీధర్ రావు, కాళేశ్వరం సీఈ హరిరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment