యాదగిరికొండ/యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. బుధవారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అదే విధంగా ఆలయ బృహత్ ప్రణాళిక కోసం వేసిన రెండు కమిటీలు (కిషన్‌రావుతో కూడిన కమిటీ, స్థల సేకరణకు మరో కమిటీ) చకచకా పనులు పూర్తి చేస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ పూర్తి చేసుకుని ఆలయానికి సంబంధించిన ప్రణాళికతో ఆర్కిటెక్టులు, స్థపతులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరో వారం, పది రోజుల్లో ఆర్‌అండ్‌బీ శాఖ నాలుగు లేన్ల రోడ్డు పనులు ప్రారంభించనుంది. ఎవరిపనులను వారికి అప్పగించిన సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ దాదాపు పూర్తయ్యింది. దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం కోసం ఆర్కిటెక్ట్‌లు, స్థపతులు, వైటీడీఏ అధికారులు వేచి చూస్తున్నారు. ఆలయాన్ని పూర్తి విశాలంగా చేయాలని సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెలుస్తోంది.
అటానమస్‌తో పెరగనున్న ఆదాయం
గుట్ట దేవస్థానం త్వరలో అటానమస్‌గా చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచా రం. దీంతో ఆలయ రూపురేఖలు మారిపోతాయని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గుట్ట దేవస్థానం ఆదాయం ప్రతి యేటా సుమారు 100 కోట్లు వస్తోంది. అటానమస్‌గా చేసి అభివృద్ధి పరిస్తే రూ. 500 కోట్ల ఆదాయం సమకూరుతుం దని నిపుణులు చెబుతున్నారు. భక్తులకు వసతి సౌకర్యాలు పెరగడంతోపాటు వసతి గదులు, దు కాణాలు, అర్చనలు, అభిషేకా లు, నిత్యకల్యాణాలు, దర్శనాలు వీటి ద్వా రా ఆదాయం చాలా వరకు పెరుగుతుందని దేవస్థానం అధికారుల సైతం చెబుతున్నారు.
మొదటి రోజు రిజిస్ట్రేషన్లు..
యాదగిరిగుట్ట అభివృద్ధికి 2 వేల ఎకరాల భూసేకరణలో భాగంగా మొదటి దశ ఓ కొలిక్కి ఇచ్చింది. బుధవారం కొందరి రైతుల నుంచి వైటీడీఏ(యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ) భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంది. వైటీడీఏ కార్యదర్శి, డిప్యూటీ కలెక్టర్ ఎం.రమేశ్‌రెడ్డి, భువనగిరి ఆర్డీఓ మధుసూదన్‌ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ఉదయాన్నే యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు.
గుండ్లపల్లి రెవెన్యూ కిందికి వచ్చే డాక్టర్ రచ్చ యాదగిరి, రచ్చ సురేష్, రచ్చ శ్రీనివాస్ కుటుంబానికి చెందిన 15ఎకరాల పదమూడున్నర గుంటల భూమికి సం బంధించిన మొట్టమొదటి డాక్యుమెంట్‌ను పరిశీలించారు. అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రచ్చ యాదగిరి కుటుంబ సభ్యులు, వైటీడీఏ కార్యదర్శి రమేశ్ రెడ్డి సంతకాలు చేశారు. బుధవారం మొత్తంగా గుండ్లపల్లికి చెందిన 16 మంది రైతులు, దాతర్‌పల్లికి చెందిన ఇద్దరి రైతులనుంచి 80 ఎకరాల ముప్పయిఐదున్నర గుంటల భూమిని వైటీడీఏకు రిజిస్ట్రేషన్ చేశారు. సంబంధిత రైతులకు నష్టపరిహారం కింద 8 కోట్ల 37లక్షల రూపాయలు చెల్లించారు. కాగా, మరో 50 ఎకరాలు రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని, వివాదం లేని 28 ఎకరాలు, 19 ఎకరాలు అసైన్‌మెంట్ భూమి, మరో 50 ఎకరాలు మొత్తం 157 ఎకరాల భూమిని రెండురోజుల్లో కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
ఇక వేగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
మొదటి దశలో దాతర్‌పల్లి, గుండ్లపల్లి గ్రామాల నుంచి అంగీకరించిన రైతులతో భూములను రిజి స్ట్రేషన్ చేసుకునేందుకు భూ సేకరణ కమిటీ, వైటీడీఏ ప్రణాళిక రూపొందించాయి. మొదటి దశలో దాతర్‌పల్లి గ్రామంలో 127 ఎకరాలు, గుండ్లపల్లి గ్రామంలో 192 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోనుంది. ఎట్టిపరిస్థితుల్లో 300 ఎకరాలు రైతుల నుంచి త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం 33 డాక్యుమెంట్లు సిద్ధం చేశారు. సంబంధిత రైతులకు వెంటనే నష్టపరిహారం నగదు కూడా అందజేయనున్నారు.
వాయిదా పడుతూ వచ్చినా ...
భూ సేకరణ కమిటీ అధికారులు రెండు వారాల క్రితం గుట్టలో విస్తృతంగా మలిదశ చర్చలు జరిపార. గుండ్లపల్లికి చెందిన 35 మంది రైతులు, దాతర్‌పల్లికి చెందిన 15 మంది రైతులతో అనేక దఫాలుగా చర్చలు జరిపారు. వీరిలో 20 మంది వరకు రైతులు దేవస్థానం అభివృద్దికి తమ భూ ములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. వీరిలో కొందరు దేవస్థానం అభివృద్ధికి తమ భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. వారి భూములను వైటీడీఏకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వారం రోజులుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా, వివిధ కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. రెండు రోజుల క్రితం డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం.రమేశ్‌రెడ్డిని వైటీడీఏకు కార్యదర్శిగా నియమించడంతో రిజిస్ట్రేషన్ల కార్యక్రమం ప్రారంభమైంది.
ఇక.. చకచకా
Published Thu, Apr 30 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM