
‘గుట్ట’ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుట్ట దేవస్థానం అభివృద్ధి మండలి సీఈఓ కిషన్‌రావు తెలిపారు.
ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుట్ట దేవస్థానం అభివృద్ధి మండలి సీఈఓ కిషన్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుట్ట దేవస్థానం అభివృద్ధికి అన్ని శాఖల నుంచి నిష్ణాతులను సభ్యులుగా తీసుకుని ఒక అథారిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరంతా కలిసి గుట్ట దేవస్థానంలో గల అభివృద్ధి కార్యక్రమాలను నిశితంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తారన్నారు. గుట్ట దేవస్థానాన్ని తిరుపతి తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయడం, అభయారణ్యాల ఏర్పాటు, వేదపాఠశాల అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతకుముందు గుట్ట దేవస్థానం ఈఓ గీతారెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.