ఖాదీ ఫర్‌ నేషన్‌.. ఖాదీ ఫర్‌ ఫ్యాషన్‌ | Yadagirigutta young mens who took the Chaitanya yatra | Sakshi
Sakshi News home page

ఖాదీ ఫర్‌ నేషన్‌.. ఖాదీ ఫర్‌ ఫ్యాషన్‌

Published Sun, Mar 10 2019 3:20 AM | Last Updated on Sun, Mar 10 2019 3:20 AM

Yadagirigutta young mens who took the Chaitanya yatra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత సంస్కృతిలో భాగమైన చేనేతను రక్షించేందుకు యువత ఖాదీ వస్త్రాలు ధరించాలని కోరుతూ యాదగిరి గుట్ట యువకులు ‘ఖాదీ ఫర్‌ నేషన్‌.. ఖాదీ ఫర్‌ ఫ్యాషన్‌’పేరిట చైతన్య యాత్ర చేపట్టారు. తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో యాదగిరి గుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన చేనేత కార్మికుడు నరేశ్, సాదువెల్లికి చెందిన రాజశేఖర్‌ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. 18 రోజుల అనంతరం గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌ల మీదుగా ప్రయాణించి శనివారం ఢిల్లీ చేరుకున్నారు.

దేశంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, దాన్ని కాపాడేందుకు ఖాదీ వస్త్రాలు ధరించాలని ఆయా రాష్ట్రాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. వీరిరువురి యాత్ర ఢిల్లీ చేరుకున్న సందర్భంగా ఎంపీ డి.రాజా, మాజీ ఎంపీ ఆనందభాస్కర్‌ ఇక్కడి తెలంగాణ భవన్‌లో వారికి స్వాగతంపలికి సన్మానించారు. అనంతరం నరేశ్, రాజశేఖర్‌ మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని రక్షించేందుకు, యువతను ఖాదీ వైపు మళ్లించడానికి యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. జీఎస్టీ, విద్యుత్‌ చార్జీల పెంపు వల్ల పలు రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమను ఆదుకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డి.రాజా కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement