
యార్లగడ్డ సమయస్ఫూర్తి!
హైదరాబాద్: ప్రముఖ రచయిత, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బ్రిటన్ పార్లమెంటులో సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. లండన్‌లో ఈ నెల 4న జరిగిన ప్రపంచ తెలుగు సదస్సుకు హాజరైన యార్లగడ్డతో కూడిన భారత ప్రతినిధి బృందం తమ పర్యటనలో భాగంగా బ్రిటన్ పార్లమెంటులో హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ) సభ్యుడు లార్డ్ లూంబ, హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ)లో నార్త్ వార్విక్‌షైర్ ఎంపీ డాన్ బైల్స్‌తో సమావేశమైంది. సమావేశంలో లూంబా మాట్లాడుతూ గతంలో పంజాబ్ యువతిని వివాహం చేసుకున్న తమ దేశ ఎంపీకి లండన్‌లోని పంజాబీలు కత్తి బహూకరించారని...మరి తెలుగువారు.. వారి అల్లుడైన (వరంగల్‌కు చెందిన యువతిని బైల్స్ పెళ్లాడారు) డాన్ బైల్స్‌కు ఏం ఇస్తారని చమత్కరించారు.
దీంతో వెంటనే స్పందించిన యార్లగడ్డ తెలుగువారికి కత్తికన్నా కలం గొప్పదంటూ రూ. 35 వేల ఖరీదైన మాల్ట్ బ్లాంక్ పెన్‌ను బహూకరించారు. సమావేశంలో పాల్గొన్న మండలి బుద్ధ ప్రసాద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల అశోక్ తేజ తదితరులు యార్లగడ్డ సమయస్ఫూర్తిని కొనియాడారు.