
బాబును పొగిడి.. కేసీఆర్‌ను తిట్టి..
ఇదీ టీడీపీ బస్సుయాత్రలో నేతలు మాట్లాడిన తీరు
► టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ లోకి లాగేందుకు మంత్రులను కాపలా పెడుతున్నాడు. రాష్ట్రానికి దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు.
► రాష్ట్రంలో మొక్కజొన్న, పత్తికి గిట్టుబాటు ధర లేదు. అదే చంద్రబాబు హయాంలో సీసీఐతో మాట్లాడి మద్దతు ధర ఇప్పించాడు.
► బాబు కేంద్రం వద్దకు వెళ్లి కరెంటు తెచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశారు. కేసీఆర్ మాత్రం సొమ్ము చేసుకుంటున్నాడు..
► రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం. పక్కరాష్ట్ర సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోండి..
►రెండుచోట్లే ఎండిన పంటల పరిశీలన
►మరోచోట ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకరోజు టీడీపీ బస్సుయాత్ర పూర్తయ్యింది. ఎండిన పంటలను పరిశీలించడం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించడం పేర జిల్లాలో శుక్రవారం టీటీడీపీ నేతలు చేపట్టిన బస్సుయాత్ర తూతూ మంత్రంగా సాగింది. కేవలం రెండు చోట్ల ఎండిన వరి పొలం మడులు (ఇందులో ఒకటి టీడీపీ కార్యకర్తది), ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించాక, నేతలంతా సూర్యాపేటకు చేరుకున్నారు. ఇక్కడ చేపట్టిన ధర్నాలో ప్రసంగించిన నేతలంతా తమ అధినేత చంద్రబాబునాయుడిని పొగడడానికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై దుమ్మెత్తి పోయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను, ఏపీ సీఎం చంద్రబాబు గొప్పతనాన్ని వల్లెవేయడానికే టీడీ పీ ధర్నా కార్యక్రమం పరిమితమైంది.
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం సమీపంలో మూడుఎకరాల్లో వరి పొలం సాగుచేసిన సురకంటి బుచ్చిరెడ్డికి చెందిన వ్యవసాయ భూమిలో ఒక ఎకరం ఎండిపోయింది. వర్షాభావం, కరెంటు కోతల వల్ల బోరులో నీటిని మూడు ఎకరాలకు పారించలేకపోవడం వల్ల ఎండిపోయిందని రైతు వివరిం చారు. అయితే, ఇప్పటికే రెండు మడుల మేర గడ్డి కోశారు. టీడీపీ బస్సు యాత్ర కోసం, నాయకులు వచ్చి చూడడం కోసమే ఈ ఒక్క మడి ఉంచామని టీడీపీ కార్యకర్త అయిన బుచ్చిరెడ్డి తనయుడు మల్లారెడ్డి చెప్పారు. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఏనుగు మల్లారెడ్డి అనే రైతు సాగు చేసిన రెండు ఎకరాల వరి పొలంలో ఎకరం దాకా ఎండిపోయింది.
5హెచ్‌పీ మోటారు, బోరు బావి ఉన్నా, వచ్చిపోయే కరెంటుతో పూర్తిస్థాయిలో పారించలేకపోయినట్లు చెప్పాడు. ఇక్కడా ఓ రెండు మూడు నిమిషాలసేపు మాత్రమే మాట్లాడిన టీడీపీ నేతలు ఎవరో తరుముతున్నట్లు వెంటనే వెళ్లిపోయారు. నార్కట్‌పల్లి మండలం కొండపాక గూ డెంలో తొమ్మిది రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న సామ సత్తిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, రూ.25 వేల ఆర్థికసాయం ప్రకటించారు. ఆయన ఇద్దరి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న బడిలో చదివిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడా పట్టుమని ఐదు నిమిషాలు కూడా గడపని నేతలు నేరుగా సూర్యాపేటకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. కాగా, నార్కట్‌పల్లికి రాగానే బస్సు మొరాయించింది. దీంతో నేతలంతా దిగి మరోబస్సు ఎక్కారు.
టీఆర్‌ఎస్‌పై.. తీవ్ర విమర్శలు
టీడీపీ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ కాదు.. బజారు తెలంగాణ చేశారంటూ మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. 8 గంటల కరెంటు హామీని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించిన టీటీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలు దిగారు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి లాగేందుకు మంత్రులను కాపలా పెడుతున్నాడని, రాష్ట్రానికి దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడంటూ త్రీవమైన ఆరోపణలు చేశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సిం హులు చంద్రబాబును పొగడడమే పనిగా పెట్టుకున్నారు. ‘బాబు కేంద్రం వద్దకు వెళ్లి కరెంటు తెచ్చారు.
ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశారు. కేసీఆర్ మాత్రం సొమ్ము చేసుకుంటున్నాడు..’ అంటూ వ్యాఖ్యానించారు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ‘తాము రాజకీయం చేయడానికి రాలేదు..’ అంటూనే పూర్తిస్థాయిలో రాజకీయ ప్రసంగం చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సైతం చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తారు. ‘రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోండి..’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.
ధర్నాలో పాల్గొని ప్రసంగించిన నేతలంతా అసలు రైతు సమస్యలను నామమాత్రంగా పేర్కొంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను నిందించడానికి, ఏపీ సీఎంను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తంగా రైతు సమస్యలపై చేపట్టిన బస్సుయాత్ర ఆకట్టుకోలేకపోయింది. ఏదో ఒక కార్యక్రమం నిర్వహించామని దేశం నేతలు చెప్పుకోవడానికే యాత్ర అక్కరకు వస్తుందన్న అభిప్రాయం సర్వత్రావ్యక్తమైంది.