జాతీయ గీతాన్ని అడ్డుపెట్టుకుని సస్పెండ్ చేశారు: ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నేతల సస్పెన్షన్ అంశాన్ని పున సమీక్షించాలని కోరుతూ పార్టీ సభాపక్షనేత ఎర్రబెల్లి దయాకరరావు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి వినతిపత్రం సమర్పించారు. ఏకపక్షంగా వ్యవహరించి తమ పార్టీ సభ్యుల్ని సస్పెండ్ చేయటం బాధాకరమన్నారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చుకునే అవకాశం తమకు ఇచ్చి ఉండాల్సిందని మంగళవారం ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే జాతీయ గీతాన్ని అడ్డుపెట్టుకుని పార్టీ నేతలను సస్పెండ్ చేయడం బాధాకరమని టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి అన్నారు. గవర్నర్ సాక్షిగా తమపై దాడిచేసిన టీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వరకూ పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.