యువకుడి దారుణహత్య | Young darunahatya | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణహత్య

Jan 14 2015 3:29 AM | Updated on Sep 2 2017 7:39 PM

ఎలిగేడు మండలం లాలపల్లికి చెందిన చిగుర్ల మహిపాల్ (22) సుల్తానాబాద్ మండలం ఐతరాజ్‌పల్లికి వెళ్లే రహదారిపై మంగళవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు.

సుల్తానాబాద్ : ఎలిగేడు మండలం లాలపల్లికి చెందిన చిగుర్ల మహిపాల్ (22) సుల్తానాబాద్ మండలం ఐతరాజ్‌పల్లికి వెళ్లే రహదారిపై మంగళవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని గొంతుకోసి హతమార్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. లాలపల్లికి చెందిన రమ, లచ్చయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. మహిపాల్ తొలిసంతానం. ఇంటర్‌వరకు చదువుకుని వ్యవసాయం చేస్తున్నాడు.   
 
బైక్ అడుక్కుని వచ్చి..
మహిపాల్‌కు బైక్ లేకపోవడంతో తన స్నేహితుడు మొలుగూరి పరమేశ్‌గౌడ్‌ను అడుక్కుని ఎలిగేడుకు వెళ్తున్నానని బయల్దేరాడు. అయితే సుల్తాన్‌పూర్ మీదుగా ఐతరాజ్‌పల్లి వస్తుండగా.. హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనంపై ఒక్కడే వచ్చాడా..? లేక ఇంకెవరైనా ఉన్నారా..? ఎలిగేడు వెళ్తున్నానని చెప్పిన అతడు ఐతరాజ్‌పల్లి వైపు ఎందుకు వెళ్లాడు..? అనేది తెలియాల్సి ఉంది.

బైక్‌పై వెళ్లిన మహిపాల్ ఎంతకూ రాకపోవడంతో అతడి సెల్‌ఫోన్‌కు రమేశ్  ఫోన్ చేశాడు. అటువైపు వెళుతున్న ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి యాక్సిడెంట్ అయి ఉన్నాడని చెప్పినట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు వచ్చి చూడగా.. రక్తపుమడుగులో చనిపోయి ఉన్నాడని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మల్లారెడ్డి, సీఐ తుల శ్రీనివాస్‌రావు, పొత్కపల్లి ఎస్సై షేక్ జాన్‌పాషా సంఘటనస్థలానికి వెళ్లి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అతడి హత్యకు కారణం ప్రేమ వ్యవహారమా..? వివాహేతర సంబంధమా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ డాటాను పరిశీలిస్తే హత్యకు దారితీసిన వివరాలు బయట పడే అవకాశముంది. మహిపాల్ తమ్ముడు ఏడాది క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు. మహిపాల్ హత్యకు గురికావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement