unidentified persons
-
కెనడాలో కాల్పులు
ఒట్టావా: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల ఘటనలు ఆగట్లేవు. తాజాగా కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్ ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్ సిటీ పరిధిలో 12వ తేన రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వాంకోవర్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హరియాణాలోని సోనిపట్ నుంచి చిరాగ్ కెనడాకు వచ్చారు. విద్యార్థి వీసా మీద కెనడాకు వచ్చి ఎంబీఏ చేసి ఇక్కడే తాత్కాలిక ఉద్యోగంలో చేరారు. ఏప్రిల్ 12వ తేదీన చిరాగ్ తన కారులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి చిరాగ్ తన కారులో విగతజీవిగా పడి ఉన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్‌చేయలేదు. చిరాగ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు భారత సర్కార్ సాయపడాలంటూ చిరాగ్ కుటుంబం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తిచేసింది. -
గ్యాంగ్‌స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య
గురుగ్రామ్: ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు, మాజీ మోడల్ దివ్యా పహుజాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఓ హోటల్ గదిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి ఆమెను హోటల్ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. తుపాకీతో ఆమె తలపై కాల్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కారులో బయటకు తరలిస్తుండగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గడోలీ హత్య కేసులో నిందితురాలైన దివ్యా పహుజాకు గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరాదిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ 2016 ఫిబ్రవరి 7న ముంబైలో హత్యకు గురయ్యాడు. నకిలీ ఎన్కౌంటర్లో హరియాణా పోలీసులే అతడిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. గడోలీ ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ వీరేంద్ర కుమార్ అలియాస్ బిందర్ గుజ్జర్ హరియాణా పోలీసులతో చేతులు కలిపి ఈ ఎన్కౌంటర్ చేయించినట్లు వెల్లడయ్యింది. గడోలీని ముంబైకి రప్పించడానికి హరియాణా పోలీసులు అతడి ప్రియురాలు దివ్యా పహుజాను పావుగా వాడుకున్నారు. ఆమె ద్వారా అతడిని హనీట్రాప్ చేశారు. -
యూపీలో భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు
షహరాన్‌పూర్: ప్రముఖ దళిత నాయకుడు, భీమ్ ఆర్మీ అధినేత, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్(36)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ యన గాయపడ్డారు. ప్రస్తు తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షహరాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బంద్ పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆజాద్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు బుధవారం చెప్పారు. కారులో ఉండగానే గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. చంద్రశేఖర్ ఆజాద్ కడుపులోకి ఓ తూటా దూసుకెళ్లిందని అన్నారు. దుండగులు ప్రయాణించిన వాహనంపై హరియాణా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందని వెల్లడించారు. వారిని గుర్తించి, అదుపులోకి తీసుకొనేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టామన్నారు. చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పుల ఘటన పట్ల ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. -
వ్యక్తిపై హత్యాయత్నం
వేంపల్లె: వేంపల్లె పట్టణ పరిధిలోని చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మారం ఆంజనేయరెడ్డిపై శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆంజనేయరెడ్డికి తలపైన, ఎడమ కాలుపై తీవ్ర గాయాలయ్యాయి. వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. బాధితుడి కథనం మేరకు.. మారం ఆంజనేయరెడ్డి ప్రతి శనివారం తెల్లవారుజామున గండి వీరాంజనేయస్వామిని దర్శించుకొనేందుకు వెళుతుంటారు. అయితే ఈ శనివారం తెల్లవారుజామున కూడా చింతలమడుగుపల్లె నుంచి మోటారు బైకుపై గండికి బయలుదేరారు. కుమ్మరాంపల్లె గ్రామం వద్ద నుంచి రెండు మోటారు బైకులలో కొందరు వ్యక్తులు కర్రలు తీసుకొని వెంబడిస్తూ వచ్చారు. వీరన్నగట్టుపల్లె బ్రిడ్జి వద్ద మోటారు బైకుపై వెనకవైపు నుంచి వస్తున్న వ్యక్తులు ఆంజనేయరెడ్డి తలపై కర్రలతో దాడి చేయగా అదుపు తప్పి కిందపడ్డాడు. గాయపడిన ఆంజనేయరెడ్డి మోటారు బైకును మళ్లీ తీసుకొని వీరన్నగట్టుపల్లె సర్కిల్‌కు చేరుకున్నారు. మళ్లీ దాడి చేసిన వ్యక్తులు అక్కడికి రావాలని ప్రయత్నించినా.. అప్పటికే స్థానికులు అక్కడ ఉండటంతో వెనుతిరిగారు. ఈ విషయాన్ని బాధితుడు తన స్నేహితుడు మల్లికి ఫోన్ చేసి తెలియజేయడంతో 108 వాహనానికి సమాచారం పంపి వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి ఆంజనేయరెడ్డిని తరలించారు. తనకు ఎవరూ శత్రువులు లేరని.. తనపై దాడి ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తనకు తెలియడంలేదని బాధితుడు ఆంజనేయరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్ ఎస్ఐ మస్తాన్ తెలిపారు. -
రెండు బైకులను తగులబెట్టిన దుండగులు
హైదరాబాద్ సిటీ: నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బషీర్‌బాగ్ చంద్రానగర్‌లో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. ఇళ్లముందర నిలిపి ఉంచిన మోటార్ బైక్‌లను పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. గతంలో కూడా దుండగులు ఇలా ద్విచక్రవాహనాలను తగులబెట్టారని బస్తీవాసులు పేర్కొన్నారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ నేత హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ నేత హత్య కలకలం రేపింది. యుపీసీసీ సీనియర్ నేత రాజ్ నరేన్ సింగ్(52)ను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఒకపక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు కావడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మునిగి తేలుతోంటే... ఆజాంఘర్ లో మాత్రం విషాదం అలుముకుంది. శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయనపై దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో నరేన్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. విచారణ జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 1993 ఎన్నికల్లో రాజ్ నారాయణ ...లాల్గంజ్ అసెంబ్లీ నియెజకవర్గం నుంచి పార్టీ తరపున పోటీ చేశారు. -
విజయనగరం జిల్లాలో నాటు తుపాకీ కలకలం
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం పెద్దబుద్దిడి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు నాటు తుపాకులతో సంచరించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఐదుగురు నాటు తుపాకీలు, లైట్లతో అటుగా వెళ్లారు. బహిర్బూమికి వెళ్లిన యువకులు దీన్ని గమనించారు. గుర్తు తెలియని వ్యక్తులను 'మీరెవరు అంటూ ప్రశ్నించగా'.. వారు పరారయ్యారు. ఆ సమయంలో ఓ నాటు తుపాకీ కిందపడింది. దొరికిన నాటు తుపాకీని యువకులు మంగళవారం పోలీసులకు అప్పగించారు. యువకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జిలో వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్ జిల్లా వేములవాడలోని ఓ వ్యక్తి దారుణ హ్యతకు గురయ్యాడు. జాత్రా గ్రౌండ్‌లోని లాడ్జి గదిలో వ్యక్తి (40) మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం గుర్తించారు. మృతుడి తలపై బలమైన గాయాలతోపాటు కారంపొడి జల్లి ఉండడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నారు. మృతుడు సిద్ధిపేట ప్రాంతానికి చెందిన రవిగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశ్నించడానికెళ్తే ప్రాణం తీశారు..
-
ప్రశ్నించడానికెళ్తే ప్రాణం తీశారు..
ఏలూరు అర్బన్: తమ్ముడి కోసం వెళ్లి అన్న మృత్యువాత పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుల కుటుంబంపై మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు దాడి చేసి ఇల్లు తగులబెట్టారు. నిందితుల కుటుంబంలోని ఇద్దరు మహిళలను స్తంభానికి కట్టేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందంటే.... మా తమ్ముడిని చంపుతానన్నావట అసలేం జరిగింది... అని అడిగేందుకు వెళ్లిన అన్న హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి మృతిచెందాడు. ఒకే ఇంట ఇద్దరి మరణాలు చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శనివారపు పేటకు చెందిన లంకపల్లి చింతారావు, లంకపల్లి శేఖర్ అన్నదమ్ములు. వీరిద్దరూ జులాయిగా తిరుగుతూ స్థానికంగా రౌడీయిజం చెలాయిస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం చింతారావు మద్యం తాగి బైకుపై వస్తూ స్థానిక కమ్యూనిటీ హాలు వద్ద కూర్చున్న పలిపే మార్యూ, తేరా రవితో గొడవకు దిగాడు. దుర్భాషలాడుతూ చంపుతానంటూ కత్తి చూపి వారిని బెదిరించాడు. భయపడిన మార్యూ, రవి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న రవి అన్న సంజీవరావు.. చింతారావు ఇంటికి వెళ్లి మా తమ్ముణ్ణి చంపుతానన్నావట అసలేం జరిగిందని అడుగుతూండగానే చింతారావు, అతని సోదరుడు శేఖర్ పక్కనే ఉన్న సమ్మెటతో సంజీవరావు తలపై బలంగా మోదడంతో తల పగిలి కనుగుడ్లు బయటకు వచ్చాయి. సంజీవరావు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. హత్యకు పాల్పడిన అన్నదమ్ములిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన మృతుడి బంధువు తేరా లక్ష్మయ్య కేకలు పెడుతూ గ్రామంలోకి పరుగులు పెట్టాడు. సంజీవరావు హత్యకు సంబంధించి సమాచారం అందుకున్న త్రీటౌన్ ఎస్సై మాతంగి సాగరబాబు, సీఐ ఎన్.రాజశేఖర్, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టా రు. అనంతరం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎస్పీ సరిత మాట్లాడుతూ నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు ప్రారంభించామన్నారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసిన సంజీవరావు తండ్రి నాగేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకున్నాడు. తలపగిలి రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసిన నాగేశ్వరరావు తల్లడిల్లిపోయాడు. కొడుకు మృతదేహం వద్ద కుప్పకూలిపోయాడు. నాగేశ్వరరావును బంధువులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. కన్నీరు మున్నీరుగా విలపించిన మృతుని భార్య వ్యవసాయ కూలీ అయిన సంజీవరావుకు ఆరునెలల కిందట స్వాతి అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. భర్త రక్తపు మడుగులో ప్రాణాలు వదలడం చూసిన స్వాతి కన్నీరు మున్నీరుగా విలపించింది. -
నడిరోడ్డుపై దారుణ హత్య
పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఆగాపూర్ రోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. ఈ దాడిలోయువకుడి తల పూర్తిగా ఛిద్రమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుంటూరులో ఆర్టీసీ బస్సుకు నిప్పు
గుంటూరు: గుర్తు తెలియని వ్యక్తులు గుంటూరులో ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నగరంలోని మెడికల్ క్లబ్ వద్ద సోమవారం అర్థరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. క్లబ్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు(ఏపీ16టీసీ4365)ను తగులబెట్టారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు, జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
సుండుపల్లి మండలం మడితాడు పంచాయతీపరిధిలోని పరిబండ శివాలయం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జరిపారు. తవ్వకాలకు ముందు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ విషయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. -
గుర్తుతెలియని మహిళ శవం..
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండలం ముసాయిపేట గ్రామ శివారులో గురువారం ఒక గుర్తు తెలియని మహిళ శవం కనిపించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి దారుణహత్య
సుల్తానాబాద్ : ఎలిగేడు మండలం లాలపల్లికి చెందిన చిగుర్ల మహిపాల్ (22) సుల్తానాబాద్ మండలం ఐతరాజ్‌పల్లికి వెళ్లే రహదారిపై మంగళవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని గొంతుకోసి హతమార్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. లాలపల్లికి చెందిన రమ, లచ్చయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. మహిపాల్ తొలిసంతానం. ఇంటర్‌వరకు చదువుకుని వ్యవసాయం చేస్తున్నాడు. బైక్ అడుక్కుని వచ్చి.. మహిపాల్‌కు బైక్ లేకపోవడంతో తన స్నేహితుడు మొలుగూరి పరమేశ్గౌడ్ను అడుక్కుని ఎలిగేడుకు వెళ్తున్నానని బయల్దేరాడు. అయితే సుల్తాన్పూర్ మీదుగా ఐతరాజ్పల్లి వస్తుండగా.. హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనంపై ఒక్కడే వచ్చాడా..? లేక ఇంకెవరైనా ఉన్నారా..? ఎలిగేడు వెళ్తున్నానని చెప్పిన అతడు ఐతరాజ్పల్లి వైపు ఎందుకు వెళ్లాడు..? అనేది తెలియాల్సి ఉంది. బైక్‌పై వెళ్లిన మహిపాల్ ఎంతకూ రాకపోవడంతో అతడి సెల్‌ఫోన్‌కు రమేశ్ ఫోన్ చేశాడు. అటువైపు వెళుతున్న ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి యాక్సిడెంట్ అయి ఉన్నాడని చెప్పినట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు వచ్చి చూడగా.. రక్తపుమడుగులో చనిపోయి ఉన్నాడని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మల్లారెడ్డి, సీఐ తుల శ్రీనివాస్‌రావు, పొత్కపల్లి ఎస్సై షేక్ జాన్పాషా సంఘటనస్థలానికి వెళ్లి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడి హత్యకు కారణం ప్రేమ వ్యవహారమా..? వివాహేతర సంబంధమా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ డాటాను పరిశీలిస్తే హత్యకు దారితీసిన వివరాలు బయట పడే అవకాశముంది. మహిపాల్ తమ్ముడు ఏడాది క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు. మహిపాల్ హత్యకు గురికావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. -
నోట్లో గుడ్డలు కుక్కి.. చిన్నారి దారుణహత్య
- చిన్నారి దారుణహత్య - తప్పిపోయిన 24 గంటల లోపే దారుణం - ఆందోళనలో కుటుంబ సభ్యులు చిన్నశంకరంపేట : ఆడుకునేందుకు వెళ్లిన ముక్కుపచ్చలారని చిన్నారి నోట్లో బట్టలు కుక్కి అత్యంత పాశవికంగా హత్య చేసి పంట పొలంలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన మండలంలోని సంకాపూర్‌లో శనివారం రాత్రి వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సంకాపూర్ గ్రామానికి చెందిన గజగట్ల స్వామి, శ్యామల దంపతుల రెండో కుమార్తె స్రవంతి (5) శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లింది. అయితే అదే రోజు గ్రామంలో ఓ పెళ్లి విందు కూడా జరుగుతుండడంతో చిన్నారి అక్కడ ఆడుకునేందుకు వెళ్లిందని స్రవంతి తల్లిదండ్రులు భావించారు. అయితే రాత్రి అయినా చిన్నారి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు. పెళ్లి విందు జరిగిన ఇంటి వద్దా ఆరా తీశారు. వారి వెంట వచ్చిన వాహనాల్లో ఏమైనా వెళ్లిందేమోనని ఆ గ్రామానికి కూడా వెళ్లి వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం చిన్నారి తండ్రి గజగట్ల స్వామి ఫిర్యాదు చేసి అనంతరం గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉండగా.. గ్రామ శివారులో గల తాగునీటి ట్యాంక్ పక్కన నుంచి దుర్వాసన వస్తుండడంతో పశువుల కాపరులు పలువురు అక్కడికి వెళ్లి చూశారు. అయితే స్వామి కుమార్తె స్రవంతి విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్రవంతి తండ్రి స్వామి అక్కడికి చేరుకుని స్రవంతి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. గ్రామస్తులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విద్యార్థులు వెళ్తున్న స్కూల్ బస్సుపై కాల్పులు
గురుదాస్‌పూర్: పంజాబ్‌లో విద్యార్థులు, స్టాఫ్ ప్రయాణిస్తున్న స్కూల్ బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. పాకిస్థాన్ సరిహద్దు గ్రామం మాంగియా వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. అయితే విద్యార్థులు, ఇతర సిబ్బంది తృటిలో్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్కూల్ సయమం ముగిసిన తర్వాత విద్యార్థులను వారి ఇళ్లకు తీసుకెళ్తున్న సమయంలో.. నలుగురు దుండగులు కారులో వచ్చి బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరాయ్యారు. ఈ సంఘటనలో ఎవరికి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామ సర్పంచ్‌పై ఆగంతకులు కత్తులతో దాడి
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిరాల గ్రామ సర్పంచ్ ముక్కిరాల కృష్ణపై శనివారం ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆ ఘటనలో కృష్ణ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దాంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ముక్కిరాల కృష్ణను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా కృష్ణపై దాడికి సంబంధించి పోలీసులు ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. -
గుంటూరు జిల్లాలో వ్యాపారిపై కాల్పులు
గుంటూరు జిల్లాలోని పిట్లవానిపాలెంలో ఆంజనేయులు అనే వ్యాపారి నివాసంపై కొంతమంది దుండగులు మంగళవారం కాల్పులు జరిపారు. దాంతో వ్యాపారి ఆంజనేయులు పోలీసులను ఆశ్రయించారు. రూ. 15 లక్షల నగదు ఇవ్వాలని ఇటీవల ఆగంతకులు తనకు ఫోన్ చేసి డిమాండ్ చేశారని ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంత మొత్తంలో నగదు ఇవ్వకపోవడంతో దుండగులు ఈ రోజు ఉదయం తన నివాసంపై కాల్పులకు తెగబడ్డారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆంజనేయులు వివరించారు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండటంతో ఎవరికి గాయాలు కాలేదని ఆయన పేర్కొన్నారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు తెగబడిన దుండగులకు సాధ్యమైంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వివరించారు.దుండగుల కాల్పుల శబ్దంతో స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.