
గురుగ్రామ్: ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు, మాజీ మోడల్ దివ్యా పహుజాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఓ హోటల్ గదిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి ఆమెను హోటల్ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది.
తుపాకీతో ఆమె తలపై కాల్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కారులో బయటకు తరలిస్తుండగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గడోలీ హత్య కేసులో నిందితురాలైన దివ్యా పహుజాకు గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరాదిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ 2016 ఫిబ్రవరి 7న ముంబైలో హత్యకు గురయ్యాడు.
నకిలీ ఎన్‌కౌంటర్‌లో హరియాణా పోలీసులే అతడిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. గడోలీ ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ వీరేంద్ర కుమార్ అలియాస్ బిందర్ గుజ్జర్ హరియాణా పోలీసులతో చేతులు కలిపి ఈ ఎన్‌కౌంటర్ చేయించినట్లు వెల్లడయ్యింది. గడోలీని ముంబైకి రప్పించడానికి హరియాణా పోలీసులు అతడి ప్రియురాలు దివ్యా పహుజాను పావుగా వాడుకున్నారు. ఆమె ద్వారా అతడిని హనీట్రాప్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment