హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘోరం జరిగింది. ఓ హోటల్‌లో గదిలో 27 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలని మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు. నిందితుడిని సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్‌గా తేల్చారు. అబిజిత్‌తోపాటు అతడి హోటల్‌లో పనిచేసే మరో ఇద్దరు ప్రకాశ్, ఇంద్రజ్‌లను గురుగ్రామ్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దివ్య హత్యకు స్కెచ్ వేసిన అభిజిత్ ఆమె మృతదేహాన్ని ఎవరికి దొరకకుండా పడేసేదుకు తన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.
హత్య ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అభిజిత్, యువతి, మరో వ్యక్తి జనవరి రెండో తేదిన హోల్ రిసెప్షన్ వద్దకు రావడం కనిపిస్తుంది. అక్కడి నుంచి రూమ్ నెంబర్111కు వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రాత్రి అభిజిత్ మరికొంతమంది దివ్య మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లడం కనిపిస్తోంది. హోటల్ నుంచి బీఎండబ్ల్యూ కారులో పారిపోవడం రికార్డయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పంజాబ్, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
దివ్య కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా 2016లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్‌కౌంటర్ కేసులో దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. అయితే గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ ప్రకాష్, అభిజీత్‌తో కలిసి దివ్య హత్యకు కుట్ర పన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
కాగా 2016 ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అతడి గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment