
ప్రతీకాత్మక చిత్రం
చండీఘడ్ : తనకు అప్పు ఇచ్చిన వ్యక్తిని దారుణంగా హతమార్చడంతో పాటు, కట్టుకున్న భార్యను కూడా గొంతు కోసి చంపాడో ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు... లుథియానాకు చెందిన హర్నీక్ సింగ్ తన వ్యాపార భాగస్వామి అయిన జక్రాన్ సింగ్ దగ్గర 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య స్నేహం చెడిపోవడంతో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ జక్రాన్ సింగ్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని భావించిన హర్నీక్ తన భార్యతో కలిసి జక్రాన్ చంపేందుకు పథకం రచించాడు. ఇందులో భాగంగా అక్టోబరు 14న తన ఇంటికి రప్పించి జక్రాన్‌ను అత్యంత దారుణంగా హతమార్చాడు. పోలీసులకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో జక్రాన్ మృతదేహాన్ని 25 ముక్కలుగా నరికి రెండు సంచుల్లో కుక్కాడు. అనంతరం గురుగ్రామ్ నుంచి లుథియానా వెళ్లే దారిలో పలు చోట్ల జక్రాన్ శరీర భాగాలను పడేసుకుంటూ వెళ్లాడు.
ఆత్మహత్య చేసుకునేందుకు నిరాకరించడంతో..
జక్రాన్ బాడీని పడేసి వచ్చిన తర్వాత హర్నీక్ భయాందోళనలకు గురయ్యాడు. పోలీసులు ఎలాగైనా తమను పట్టుకుంటారని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు భార్యను కూడా ఇందుకు ఒప్పించాడు. భర్త మాటలకు మొదట సరేనన్న ఆమె.. తర్వాత అందుకు నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన హర్నీక్ భార్య గొంతు కోశాడు. ఆమె మృతిచెందగానే తనను గాయపరచుకున్నాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తమ ఇంట్లో దొంగలు పడ్డారని, వారే తన భార్యను హత్య చేశారని ఫిర్యాదు చేశాడు. అయితే హర్నీక్ ప్రవర్తనపై అనుమానం కలగడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment