హత్యాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
ఏలూరు అర్బన్: తమ్ముడి కోసం వెళ్లి అన్న మృత్యువాత పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుల కుటుంబంపై మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు దాడి చేసి ఇల్లు తగులబెట్టారు. నిందితుల కుటుంబంలోని ఇద్దరు మహిళలను స్తంభానికి కట్టేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
అసలేం జరిగిందంటే....
మా తమ్ముడిని చంపుతానన్నావట అసలేం జరిగింది... అని అడిగేందుకు వెళ్లిన అన్న హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి తండ్రి మృతిచెందాడు. ఒకే ఇంట ఇద్దరి మరణాలు చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శనివారపు పేటకు చెందిన లంకపల్లి చింతారావు, లంకపల్లి శేఖర్ అన్నదమ్ములు. వీరిద్దరూ జులాయిగా తిరుగుతూ స్థానికంగా రౌడీయిజం చెలాయిస్తుంటారు.
ఆదివారం మధ్యాహ్నం చింతారావు మద్యం తాగి బైకుపై వస్తూ స్థానిక కమ్యూనిటీ హాలు వద్ద కూర్చున్న పలిపే మార్యూ, తేరా రవితో గొడవకు దిగాడు. దుర్భాషలాడుతూ చంపుతానంటూ కత్తి చూపి వారిని బెదిరించాడు. భయపడిన మార్యూ, రవి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న రవి అన్న సంజీవరావు.. చింతారావు ఇంటికి వెళ్లి మా తమ్ముణ్ణి చంపుతానన్నావట అసలేం జరిగిందని అడుగుతూండగానే చింతారావు, అతని సోదరుడు శేఖర్ పక్కనే ఉన్న సమ్మెటతో సంజీవరావు తలపై బలంగా మోదడంతో తల పగిలి కనుగుడ్లు బయటకు వచ్చాయి. సంజీవరావు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. హత్యకు పాల్పడిన అన్నదమ్ములిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.
ఇది గమనించిన మృతుడి బంధువు తేరా లక్ష్మయ్య కేకలు పెడుతూ గ్రామంలోకి పరుగులు పెట్టాడు. సంజీవరావు హత్యకు సంబంధించి సమాచారం అందుకున్న త్రీటౌన్ ఎస్సై మాతంగి సాగరబాబు, సీఐ ఎన్.రాజశేఖర్, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టా రు. అనంతరం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎస్పీ సరిత మాట్లాడుతూ నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు ప్రారంభించామన్నారు.
కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి
తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసిన సంజీవరావు తండ్రి నాగేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకున్నాడు. తలపగిలి రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసిన నాగేశ్వరరావు తల్లడిల్లిపోయాడు. కొడుకు మృతదేహం వద్ద కుప్పకూలిపోయాడు. నాగేశ్వరరావును బంధువులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు.
కన్నీరు మున్నీరుగా విలపించిన మృతుని భార్య
వ్యవసాయ కూలీ అయిన సంజీవరావుకు ఆరునెలల కిందట స్వాతి అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. భర్త రక్తపు మడుగులో ప్రాణాలు వదలడం చూసిన స్వాతి కన్నీరు మున్నీరుగా విలపించింది.