నవతరం
ఏడాదిలోపే లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నేతలు తమ కార్యకలాపాలను క్రమంగా ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో దశాబ్దాల తరబడి రాజకీయాల్లో కొనసాగుతున్న నేతలే వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలపై కన్నేసిన యువ, ఔత్సాహిక నేతలు కూడా అవకాశం దక్కితే ఎన్నికల బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో అరంగేట్రానికి ఉత్సాహం చూపుతున్న నేతల్లో ఎక్కువమంది పేరొందిన రాజకీయ నేతల వారసులే కావడం గమనార్హం. వీరితో పాటు ప్రవాస భారతీయులు, ఔత్సాహికులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పక్షాల టికెట్ల పందేరం ఎన్నికల నాటికి వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై తరచూ చర్చ జరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని భావిస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల తరఫునా పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని ముఖ్య రాజకీయ నేతల వారసులతో పాటు, ప్రవాస భారతీయులు, ఔత్సాహిక నేతలు కూడా పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ అరంగేట్రానికి ఆసక్తి చూపుతున్న వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీ అవకాశం దక్కని చోట కొత్త అభ్యర్థులు, లేదా వారసులు టీఆర్‌ఎస్ పక్షాన బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ, టీజేఎస్ తరఫునా యువ నాయకులు, రాజకీయేతర సంస్థలకు చెందిన వారు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు టికెట్ దక్కని పక్షంలో భవిష్యత్తులో ఇతర రాజకీయ అవకాశాలైనా వస్తాయనే ఆశతో ఉన్నారు.
-
సాధారణ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు టికెట్ దక్కని పక్షంలో భవిష్యత్తులో ఇతర రాజకీయ అవకాశాలైనా వస్తాయనే ఆశతో ఉన్నారు. వీరి ప్రయత్నాలకు ఆయా పార్టీల అధిష్టానం ఎంత మేర ప్రాధాన్యత ఇస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ కార్యదర్శి ఎం.ఎ.ఫహీంతో పా టు సిద్దిపేటకు చెందిన ఎన్‌ఆర్‌ఐ గంప వేణుగోపాల్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఫహీం, వేణుగోపాల్ రాష్ట్ర రాజకీయాల జోలికి వెళ్లకుండా, ఏఐసీసీ అధిష్టానం వద్ద తమ పలుకుబడితో టికెట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఇద్దరు రాజకీయ దిగ్గజాల వారసులు బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. దివంగత బాగారెడ్డి కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెలే గీతారెడ్డి కూతురు మేఘనారెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే యోచనలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన టీపీసీసీ బస్సు యాత్రలో భాగంగా జహీరాబాద్‌లో జరిగిన సభ ఏర్పాట్లను మేఘనా రెడ్డి పర్యవేక్షించడంతో అరంగేట్రం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రెండు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్ వారసుల రంగ ప్రవేశంపై జోరుగా చర్చ జరుగుతోంది. దామోదర జన్మదినం సందర్భంగా ఆయన కూతురు త్రిష ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. తాజాగా నియోజకవర్గంలో హరీశ్‌రావు పర్యటన సందర్భంగా బాబూమోహన్ కుమారుడు ఉదయ్ పేరిట పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చారు.
దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ తన తండ్రి ముత్యంరెడ్డి చేసిన సేవలను గుర్తు చేస్తూ, కేడర్‌ను కలుస్తున్నారు.
పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో యువ నాయకత్వం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే యోచన తో ఉంది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కు మారుడు అభిషేక్ (బీజేపీ), పటాన్‌చెరు జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ (టీడీపీ) ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు అమీన్‌పూర్ సర్పంచ్ కాటా శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్), గోదావరి అంజిరెడ్డి (కాంగ్రెస్) పోటీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను ఆశించే అవకాశం ఉంది. హత్నూర జెడ్పీటీసీ సభ్యురాలు పల్లె జయశ్రీ కూడా టీఆర్‌ఎస్ టికెట్‌ను కోరాలనే యోచనలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మేనల్లుడు సంతోష్‌రెడ్డి ఇటీవల నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రవాస భారతీయుడు ఆత్మకూరు నాగేశ్ కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమితిని టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కుమారుడు జశ్వంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ నుంచి ప్రతాప్‌రెడ్డి చేరికతో జశ్వంత్‌కు ఎంత మేర అవకాశం దక్కుతుందో చూడాల్సిందే.- సిద్దిపేట జిల్లా పరిధిలో కొత్తగా చేరిన హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment