చూద్దాం.. చేద్దాం!
- రాజకీయ విభజనపై పార్టీల తీరు
- దసరా తర్వాతేనంటున్న నాయకులు
- ఇప్పటికే కమిటీలపై కొన్ని పార్టీల కసరత్తు
- నేతల అభిప్రాయ సేకరణలో బీజేపీ
- కొత్త జిల్లాలొచ్చాకేనంటోన్న వైఎస్సార్ సీపీ, టీడీపీ
- చడీచప్పుడు లేని టీఆర్‌ఎస్ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గులాబీ దళపతి జిల్లాలను విభజించే పని పెట్టుకుంటే... ప్రతిపక్ష నేతలు రాజకీయ విభజన పనిలో పడ్డారు. కొత్త జిల్లాలతో పాటే జిల్లా కమిటీలను కూడా మనుగడలోకి తెచ్చేందుకు జాతీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా.. ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీలు విభజన తర్వాత చూద్దాంలే అన్న యోచన చేస్తున్నాయి.
ఇక ఈ తంతంగం అంతటికీ మూలమైన టీఆర్‌ఎస్ పార్టీలో ఇప్పటి వరకు రాజకీయ విభజన, కొత్త జిల్లాల కమిటీలు అనే అంశమే చర్చకు రాలేదు. జిల్లాల విభజన ప్రక్రియ, నామినేటెడ్ పోస్టుల ఎంపిక తదితర అంశాలను పూర్తి చేసుకున్న తర్వాతే పార్టీ కమిటీల మీద దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.
జాతీయ పార్టీల జాగ్రత్త
మండల, జిల్లా కమిటీల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు ఈ నెల 19వ తేదిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన 20 తేదిన కూడా ఇక్కడే ఉండి కొత్త జిల్లాల్లో కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి రెండు పదవులను మాత్రమే మార్పులు చేర్పులు చేసి.. కొత్త వారిని తీసుకుంటారు.
మండల కమిటీలు, బ్లాక్ కమిటీ, జిల్లా కమిటీలు యథాతధంగా కొనసాగుతాయి. దసరా తర్వాత కొత్త కమిటీలు మనుగడలోకి రావొచ్చని డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. బీజేపీ ఇది వరకే కొత్త జిల్లాలు ఏర్పాటు, జిల్లా కమిటీ నియామకాలపై రాష్ట్ర కమిటీ చర్చించింది. ఈ మేరకు జిల్లా పార్టీ నాయకత్వం నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ నెల 17 రాష్ట్రానికి అమిత్‌షా వస్తున్నారు.
ఈ అభిప్రాయాలను ఆయన ముందు పెట్టి అమిత్‌షాతో చర్చించిన అనంతరం కొత్త జిల్లాల్లో కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారు. కొత్త జిల్లాలో పూర్తిస్థాయి కమిటీలు వేసే విధంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. దసరా మరుసటి రోజు నుంచే కొత్త కమిటీలు మనుగడలోకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షడు కాసాల బుచ్చిరెడ్డి చెప్పారు.
వామపక్షాలు సిద్ధమే...
వామపక్ష పార్టీల్లో జిల్లా కమిటీల ఏర్పాటుపై అంతర్గత చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే రాజకీయ విభజన చేసేందుకు కసరత్తు చేస్తోంది. దసరా తర్వాతే మండల, జిల్లా కమిటీల ఎన్నికల జరిపే విధంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశ్ చెప్పారు.
ఇక సీపీఐ ఇప్పటికే పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి కొత్త జిల్లా కౌన్సిల్‌లను ఏర్పాటు చేసుకునే విషయంలో కొంత స్పష్టంగానే ఉన్నా.. ఆ పార్టీ రాష్ట్ర నాయకుల మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నెల 28, 29 తేదిల్లో జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో కొత్త జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకునే విషయంలో గ్రీన్‌సిగ్నల్ వస్తుందని ఆ పార్టీ జిల్లా సమితి కార్యదర్శి పవన్ చెబుతున్నారు.
అధికారికంగానే...
వైఎస్సార్‌సీపీ విషయానికి వస్తే ఇప్పటికే మండల, గ్రామ కమిటీల ఏర్పాటులో ఆ పార్టీ జిల్లా నాయకత్వం బిజీగా ఉంది. తెలంగాణ పార్టీ పగ్గాలను డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డికి ఇచ్చిన తర్వాత వడివడిగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారికంగా జిల్లా విభజన జరగ్గానే పార్టీ కమిటీలు ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మూడు జిల్లాల్లో పార్టీ కేడర్ నిలదొక్కుకుంటోందని, ఈ సమయంలో కొత్త కమిటీలు నియమించుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్తున్నారు.
మహానాడు తరువాత..
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే విభజన కోణంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలనే చర్చ ఆ పార్టీలో పెద్దగా జరగడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పష్టత వచ్చాక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే ఆలోచనలో టీడీపీ ఉంది. ఇది పూర్తి అయ్యాక మండల కమిటీలు, నియోజకవర్గం ఇన్‌చార్జీలను నియమించుకునే ఆలోచనతో ఉంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాక రాష్ట్ర నాయకత్వంతో చర్చించి మహానాడు జరిగే జనవరి, ఫిబ్రవరి నెలలో రాజకీయ విభజన ఆలోచన ఉంటుందని టీడీపీ రాష్ట్ర నాయకుడు, టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చెప్పారు.
అంతా బాస్ చూసుకుంటారు..
ఇక విభజన చిచ్చు పెట్టిన అధికార టీఆర్‌ఎస్ పార్టీలో మాత్రం ఉలుకుపలుకు లేదు. పైగా మిగిలిన అన్ని పార్టీల కంటే టీఆర్‌ఎస్ పార్టీది విచిత్ర పరిస్థితి. ఇప్పటి వరకు ఆ పార్టీలో జిల్లా కమిటీ నిర్మాణమే లేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిని నియమించి రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు జిల్లా కమిటీ నిర్మాణం జరగలేదు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.
ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఆయా జిల్లాలకు కొత్త కమిటీలు వేస్తారా? లేదా? అనే దానిపై కూడా పార్టీ నాయకత్వంలో స్పష్టత లేదు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాల విభజన పనిలో బిజీగా ఉండడంతో, పార్టీ పరంగా ఆయన ఇప్పటివరకు ఇతర నాయకులతో ఎలాంటి చర్చ చేయలేదని తెలుస్తోంది. జిల్లాల విభజన పని ప్రభుత్వపరంగా పూర్తయిన తర్వాత పార్టీ గురించి ఆలోచన చేసే అవకాశం ఉందని, లేదంటే ఎలాగూ ఏప్రిల్ వరకు పాత కమిటీలకు పదవీకాలం ఉన్నందున.. ఆపై కొత్త కమిటీలు వేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.