కడప సెవెన్‌రోడ్స్ : రాష్ర్టంలో జరుగుతున్న వాస్తవ విషయాలను ప్రజలకు చూపిన ‘సాక్షి’ టీవీ ఛానల్ ప్రసారాలను నిలిపి వేయడం పట్ల పాత్రికేయులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమన్నారు. నిజాలను ప్రసారం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో నేరమైపోయిందని, ఇది ఆయన నియంత పోకడలను వెల్లడిస్తోందని ధ్వజమెత్తారు. సాక్షి ఛానల్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో డిమాండ్ చేశారు.
కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా మాట్లాడుతూ మనది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని, రాష్ట్రంలో మాత్రం నియంతృత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. సాక్షి ప్రసారాలను అడ్డుకోవడం మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.
నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆందోళనలను సాక్షి టీవీ ప్రసారం చేస్తుంటే వాటిని నిలిపి వేయడం దారుణమన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజెప్పే బాధ్యత మీడియాపై ఉందన్నారు. బాబు నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఏపీయూడబ్ల్యుజే నాయకుడు పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మీడియాను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారని తెలిపారు. సాక్షి టీవీ, పత్రికను స్వాధీనం చేసుకుంటామంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించడం సరికాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు మోసానికి పర్యాయ పదంగా నిలిచారన్నారు. ఆ విషయాలను ప్రసారం చేస్తున్న సాక్షి ఛానల్‌ను అడ్డుకోవడం ద్వారా నియంతగా మారాడని విమర్శించారు. మీడియాతో పెట్టుకున్న ఎవరూ చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవని హెచ్చరించారు.
మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే చంద్రబాబు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.చంద్ర మాట్లాడుతూ వాగ్ధానాల అమలులో బాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. వీటిని ప్రశ్నించిన సాక్షి టీవీ గొంతునొక్కడం సరికాదన్నారు. అమరావతి భూసేకరణలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్నందునే ముఖ్యమంత్రి సహించలేక పోతున్నారని ఆరోపించారు.
పత్రికా స్వేచ్ఛను కాలరాస్తే సహించబోమని బీజేపీ జిల్లా కార్యదర్శి సాంబశివారెడ్డి అన్నారు.
సీపీఎం నగర కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ సాక్షి టీవీ ప్రసారాలు అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. పరోక్షంగా ఇది ప్రజలపై దాడి చేసినట్లేనన్నారు.
పీసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సత్తార్ మాట్లాడుతూ సాక్షి ప్రసారాలు నిలిపి వేయడం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ఏవైనా తప్పులుంటే నోటీసులు జారీ చేసి ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలే తప్ప ప్రసారాలు నిలిపి వేయడం తగదన్నారు.
అనంతరం కలెక్టర్ కేవీ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబ టూరు ప్రసాద్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణరావు, ఎస్.రమణయ్య, కార్పొరేటర్లు పాకా సురేష్, జమ్మిరెడ్డి, చినబాబు, సానపురెడ్డి శివకోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బి.నిత్యానందరెడ్డి, పులి సునీల్‌కుమార్, టీపీ వెంకట సుబ్బమ్మ, ఖాజా రహమతుల్లా, చల్లా రాజశేఖర్, సీపీఎం నాయకులు సావంత్ సుధాకర్‌రావు, ఇన్సాఫ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అమ్మిరెడ్డి నాగేంద్రకుమార్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు షాషా వలీ, జెమిని టీవీ ప్రతినిధి ఆర్‌ఎస్ రెడ్డి, టీవీ9 ప్రతినిధి డి.సదాశివరెడ్డి, హెచ్‌ఎం టీవీ ప్రతినిధి నాగరాజు, ఎక్స్‌ప్రెస్ టీవీ ప్రతినిధి మస్తాన్‌వలీ, జాప్ నాయకుడు జ్యోతి జార్జి, మున్సిఫ్ టీవీ ప్రతినిధి సర్దార్, ప్రజాశక్తి ప్రతినిధి నూర్‌బాషా, స్టూడియో ఎన్ ప్రతినిధి షౌకత్ పాల్గొన్నారు.
నిజాలు చూపడమే నేరమా..!
Published Tue, Jun 14 2016 3:20 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement