హైదరాబాద్ ఈసీఐఎల్‌లో రహదారిపై కుప్పకూలిపోయిన పృథ్వీరాజ్ వద్ద విలపిస్తున్న భార్య... సాయం చేయడానికి వెనకాడుతూ చోద్యం చూస్తున్న జనం
కుషాయిగూడ (హైదరాబాద్): ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి.. మనుషుల్లో మానవత్వాన్ని కూడా మాయం చేస్తోంది. తోటి మనిషి ఎంత ఆపదలో ఉన్నా.. అతడికి సాయం చేద్దామనే ఆలోచన మచ్చుకైనా కనిపించని పరిస్థితిలోకి ప్రపంచం వచ్చేసింది. వారికి సాయపడితే ఆ మాయలమారి తమకు ఎక్కడ సోకుతుందో అనే భయమే అందరిలోనూ కనిపిస్తోంది. దీంతో ఎదుటి మనిషి ప్రాణం పోతున్నా కూడా మనకెందుకులే అని దూరం నుంచే తప్పుకుంటున్నారు తప్ప.. దగ్గరకెళ్లి సాయం చేసి అతడి ప్రాణం నిలబెట్టాలనే భావన కొంచెం కూడా ఎవరి మదిలోనూ మెదలడంలేదు.
సాయం కోసం అర్థిస్తూ కళ్ల ముందే కుప్పకూలినా సరే కరోనా భయం వారిని అడుగు ముందుకు వేయనీయడంలేదు. ఈ నేపథ్యంలో మానవత్వం కూడా అంతరించిపోయేవాటి జాబితాలో చేరిపోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోగా.. ఏ ఒక్కరూ సాయం చేయడానికి సాహసించలేదు. అతడి పరిస్థితి చూసి, అయ్యో పాపం అన్నారే తప్ప.. మేమున్నాం అంటూ ముందుకు రాలేదు.
ఆటో ఎక్కుతూ...
హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని బీజేఆర్ కాలనీకి చెందిన పృథ్వీరాజ్ (35) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు అతడిని పరీక్షించి పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి నిమ్స్‌కు వెళ్లేందుకు ఆటో మాట్లాడుకున్నారు. అనంతరం ఆటోలోకి ఎక్కబోతూ ఒక్కసారిగా పృథ్వీరాజ్ కుప్పకూలిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు ఎంతగా కదిపినా చలనం కనిపించలేదు. అతడు కింద పడిపోవడం.. కుటుంబ సభ్యులు ఆందోళనతో రోదించడాన్ని అక్కడ ఉన్న జనం అలా చూస్తూ ఉన్నారే తప్ప.. ఏ ఒక్కరూ కూడా వారికి సాయం చేసేందుకు వెళ్లలేదు.
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. పృథ్వీ కుటుంబ సభ్యులు వెంటనే 108కి కాల్ చేయగా.. నిమిషాల్లోనే ఆ అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. అయితే, 108 సిబ్బంది అతడిని పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, పృథ్వీ మృతదేహాన్ని 108 వాహనంలోకి ఎక్కించేందుకు కూడా ఎవరూ సాయం చేయకపోవడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. కరోనా కారణంగా సాయం కూడా చేయలేకపోతున్నామని మాట్లాడుకోవడం తప్ప.. సాహసించి ఎవరూ ముందుకు వెళ్లలేదు. దీంతో 108 సిబ్బంది, పృథ్వీ కుటుంబ సభ్యులే అతడి మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment