
సాక్షి, శంషాబాద్(రాజేంద్రనగర్): ఓ ఆవు యువకుడిని తాడుతో సహా ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాల పాలై దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామంలో చోటుచేసుకుంది. అయినాల హరీష్‌రెడ్డి(21) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తల్లి ఉమకు చేదోడువాదోడుగా ఉంటూ పొలం పనులతో పాటు ఆవుల పోషణ చూస్తున్నాడు.
శనివారం మధ్యాహ్నం సమయంలో తమ మూడు ఆవులను మేపడానికి గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఒక ఆవుకు కట్టిన తాడును తన నడుముకు చుట్టుకున్నాడు. ఇంతలో ఆవు బెదిరి తాడుతో పాటు అతన్ని ఈడ్చుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని అరుపులు విన్న సమీపంలోని రైతులు అక్కడకు వెళ్లేసరికే హరీష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
ఏడాది కిందట తండ్రి మృతి..
హరీష్ తండ్రి వెంకట్‌రెడ్డి ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం తల్లి ఉమ మోయడంతో హరీష్ ఆమెకు చేదోడుగా ఉండేవాడు. ఇతనికి ఓ చెల్లెలు ఉంది. చేతికంది వచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లి రోదనలు మిన్నంటాయి.