నాలుగేళ్లుగా భర్త అన్నావ్‌.. కానీ ఇపుడు | young man missing after taking selfie vedio | Sakshi
Sakshi News home page

ప్రియురాలు మోసం చేసిందని సెల్ఫీ వీడియో తీసి..

Published Fri, Nov 3 2017 2:27 PM | Last Updated on Fri, Nov 3 2017 4:38 PM

 young man missing after taking selfie vedio - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన కంటే నాలుగేళ్లు పెద్దదైన అమ్మాయిని ప్రేమించాడు... చివరకు ఆమె తన ప్రేమను కాదు పొమ్మందని.. ఓ యువకుడు మనస్తాపానికి గురై ఇంటినుంచి వెళ్లిపోయాడు. నగరంలోని మల్కాజిగిరిలో నివసించే సాయి చైతన్య అనే యువకుడు మణికొండకు చెందిన సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. బంధువు అయిన సంధ్య, సాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ అమ్మాయి తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో సంధ్య కొన్ని రోజులుగా సాయి చైతన్యకు దూరంగా ఉంటోంది. ఇది తట్టుకోలేని సాయి అమ్మాయి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కలత చెందిన సాయి చైతన్య తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిమోసం చేసిందంటూ సంధ్యపై ఫిర్యాదు చేసేందుకు మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే అతనిపై సైబర్ క్రైంలో ఫిర్యాదు ఉండటంతో అతని ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. దాంతో అక్టోబర్ 21వ తేదీన ఒక సెల్ఫీ వీడియో తీసుకుని అందులో సంధ్య తనను ప్రేమించి మోసం చేసిందని, అదేమని అడిగినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే చైతన్య తల్లితండ్రులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తరపు వాళ్లు తమ కుమారుడిని ఏమైనా చేసి ఉంటారని సాయి చైతన్య తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకును క్షేమంగా తమకు అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు.

కాగా సాయి చైతన్య వివరణ మరోలా ఉంది. ప్రేమ పేరుతో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సాయి సెల్పీ వీడియా తీసుకున్నాడు. తనను క్షమించమని.. మంచి కొడుకును, మంచి అన్నని కాలేక పోయానని ఆ వీడియోలో తెలిపాడు. ఏం చేయాలో తెలియడం లేదని.. ప్రేమించిన అమ్మాయి మోసాన్ని తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోతున్నానన్నాడు. 'నాలుగేళ్లు నాతోనే ఉంది.. నువ్వే భర్తవి.. నువ్వే సర్వస్వం అని.. నా జీవితంతో ఆడుకుని.. చివరికి నన్ను చచ్చిపో అంది. ఏం చేయాలో తెలియక ఒకసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను.

అతి కష్టం మీద మీరు నన్ను బతికించుకున్నారు. ఆ తర్వాత కూడా తను నన్ను అర్దం చేసుకోలేదు. ఇపుడు నాకు ఏమి అర్దం కాలేదు. అంతే కాకుండా వన్‌ సైడ్‌ లవ్‌ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను ప్రేమించిందని.. అన్నీ ఆధారాలు ఉన్నాయన్నా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. సైబర్‌ ఎస్‌ఐ నన్ను బెదిరిస్తున్నాడు. ఎవరి నుంచి నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. నాలుగేళ్లు పెద్దదైనా నా జీవితంలో ఉంటానంటే ప్రాణంగా ప్రేమించాను. కానీ చివరికి ఇలా చేస్తుందనుకోలేదు. నాకు ఉన్నది మీరే.. మీరైనా న్యాయం జరిగేలా చేయండి..' అంటూ తన చెల్లెళ్లకు వీడియాను పంపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement