ప్రవీణ్ (ఫైల్)
కేపీహెచ్‌బీ కాలనీ: జూదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జూదం ఆడుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు వస్తున్నారంటూ అరుపులు వినిపించడంతో గదిలో ఉన్న యువకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి దూకగా, మరికొందరు రెండవ అంతస్తు నుంచి దూకారు. ఇందులో ఓ యువకుడు రోడ్డుపైకి దూకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మూసాపేట జనతానగర్‌లో నివాసం ఉండే మల్లేష్, లక్ష్మిలకు ఇద్దరు కొడుకులు, ఒక్క కుమార్తె. వీరిలో పెద్దకొడుకు ప్రవీణ్ అలియాస్ స్వామి(26) ఎంబీఏ వరకూ చదువుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రవీణ్ స్థానికంగా ఉన్న మరికొందరు స్నేహితులతో కలసి ఓ యువజన నాయకుడి ఇంటి రెండవ అంతస్తులోని గదికి వెళ్లారు.
అక్కడ కొందరు పత్తాలాడుతుండగా మరికొందరు వారితో ముచ్చటిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎస్‌వోటీ పోలీసులు వచ్చారన్న అరుపులు విన్న గదిలోని యువకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పరుగులు పెట్టగా, రెండవ అంతస్తులోనే ఉన్న ప్రవీణ్‌కు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో అక్కడ్నుంచి కిందకు దూకాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంతారావు అనే మరో యువకుడు సైతం పక్క భవనంపైకి దూకడంతో అతని కాలుకు తీవ్రగాయాలైనట్లు తెలిసింది. అయితే, అతని ఆచూకీ కూడా తెలియడంలేదు.
విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎస్‌వోటీ పోలీసులు రైడ్‌కు వెళ్లలేదని, అలాంటి సమాచారం తమకు లేదంటున్నారు కూకట్‌పల్లి పోలీసులు. పోలీసులు వస్తున్నారన్న పుకార్లతోనే యువకులు భయాందోళనకు గురై భవనంపై నుంచి దూకి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు మాత్రం సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు ఆ భవనం వద్దకు వచ్చిన తరువాతే అలజడి నెలకొందంటున్నారు. మృతిచెందిన ప్రవీణ్ తమ్ముడు క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment