పోలీసు దెబ్బలకే చనిపోయాడు!
యువకుడి మృతిపై కుటుంబసభ్యులు, గ్రామస్తుల ఆందోళన
గజ్వేల్: కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న యువకుడు మృతి చెందడం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. దొంగతనం కేసులో అతడిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంతోనే చనిపోయాడంటూ కుటుంబసభ్యు లు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బంగ్లా వెంకటాపూర్‌లో ఫిబ్రవరి 28న భూషణం ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. బేగంపేట పోలీసులు బంగ్లా వెంకటాపూర్‌కు చెందిన మాస్టి స్వామి (30)తోపాటు మరో ముగ్గురిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రమంలో స్వామి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఈ నెల 14న గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం స్వామి చనిపోయాడు. దీంతో ఆగ్రహించిన అతడి బంధు వులు, గ్రామస్తులు మక్తమాసన్‌పల్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. 3 గంటలపాటు గజ్వేల్‌ృ తూప్రాన్ రోడ్డు స్తంభించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునేలా చూస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కాలేయం సమస్యతోనే మృతిచెందాడు: సీఐ
పోలీసులు కొట్టడంతోనే స్వామి మృతి చెందాడన డంలో వాస్తవం లేదని తొగుట సీఐ సోంనారాయణ సింగ్ తెలిపారు. కాలేయం సమస్యతోనే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు.