
బాధితుడితో మాట్లాడుతున్న ఎస్‌ఐ నర్సింహులు
వెల్దండ (కల్వకుర్తి): భూ సమస్య పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే నిలువరించారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన బొక్కల రామస్వామి రెండేళ్ల క్రితం మృతి చెందారు. ఈయనకు సర్వే నం.187, 194. 195, 198, 199, 200, 201లలో నాలుగెకరాల పొలం ఉంది. అనంతరం దీనిని భార్య బొక్కల లక్ష్మమ్మకు విరాసతు చేశారు. అయితే ఈ పట్టా భూమి కాస్తా అన్‌లైన్‌లో అసైన్డ్‌గా నమోదైంది.
దీంతో తల్లితో పాటు కుమారుడు బొక్కల శ్రీనివాస్ పట్టా భూమిగా నమోదు చేయాలని ఏడాది కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కరించలేకపోయారు. చివరకు విసుగు చెందిన అతను సోమవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌బాటిల్ తీసి ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకోవడానికి యత్నించాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న రైతులు బాటిల్‌ను తీసివేసి అగ్గిపెట్టెను లాగేశారు. అనంతరం బాధితుడితో ఎస్‌ఐ నర్సింహులు, తహసీల్దార్ సైదులు, డీటీ వెంకటరమణ మాట్లాడారు. మూడు రోజుల్లో సమస్యను తీర్చుతామని హామీ ఇవ్వడంతో శాంతించి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment