
ఏటీఎం దోపిడీ కేసు నిందితుడు పట్టుబడ్డాడిలా...
హైదరాబాద్: సంచలనం సృష్టించిన యూసఫ్ గూడ ఏటీఎం దోపిడీ కేసు నిందితుడిని పోలీసులు గురువారం రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి గత మూడేళ్లుగా ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉంటూ నేరాలకు పాల్పతున్నాడని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. విలాసాలకు అలవాటుపడి అతడు వక్రమార్గం పట్టాడని చెప్పారు.
సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అతన్ని పట్టుకున్నామని వెల్లడించారు. యూసఫ్ గూడ ఏటీఎంలో చొరబడి నాటు తుపాకీతో యువతిని బెదిరించి ఏటీఎం కార్డు, ఆభరణాలు ఎత్తుకుపోయాడన్నారు. యువతిని భయపెట్టేందుకు తుపాకీతో పక్కకు కాల్చాడని వెల్లడించారు.
తన తెలిసిన వారి సహకారంతో మహారాష్ట్రలో ఈ తుపాకీ కొనుగోలు చేసినట్టు నిందితుడు చెప్పాడని కమిషర్ తెలిపారు. కేసును సీరియస్ గా తీసుకుని 24 గంటల్లో ఛేదించామన్నారు. అతడి వద్ద నుంచి 3 ఏటీఎం కార్డులు, 5 సెల్ ఫోన్లు, బంగారపు గొలుసు, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
హాస్టల్స్ లో చేరే వారి విషయంలో హాస్టల్స్ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఏటీఎం కేంద్రాల్లో తప్పనిసరిగా సెక్యురిటీ ఉండాలని, క్వాలిటీ సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించినట్టు కమిషనర్ చెప్పారు.