
కుర్రాడికి చిర్రెత్తింది!
ఇటు పోలీస్ చలాన్లు అటు నో క్యాష్ ఏటీఎంలు
►అసహనంతో ఏటీఎంల అద్దాలు ధ్వంసం
►హనం స్వాధీనం చేసుకున్న పోలీసులు
►చలాన్ సొమ్ము చెల్లించడానికి
►ఏటీఎంల చుట్టూ తిరిగినా దొరకని డబ్బు
హైదరాబాద్: ఓవైపు ట్రాఫిక్ పోలీసుల చలాన్.. కట్టడానికి వెళ్తే.. వెక్కిరిస్తున్న నో క్యాష్ బోర్డులు.. అంతే.. ఓ కుర్రాడికి చిరెత్తుకొచ్చింది..2 ఏటీఎం కేంద్రాల అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఉదంతం మంగళవారం సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్స్ ప్రారంభించారు. సంతోష్‌నగర్‌కు చెందిన విద్యార్థి అమీర్ ఖాన్(21) తన వాహనంపై వస్తూ కోఠి ఉమెన్స్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. పీడీఏ మిషన్‌లో తనిఖీ చేసిన పోలీసులు ఆ వాహనంపై రూ.505(నాలుగు చలాన్లు) పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
అమీర్ హెల్మెట్ ధరించకపోవడం, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో మరో రూ.1,300 స్పాట్‌లో వడ్డించారు. జరిమానా మొత్తం రూ.1,805 చెల్లించి వాహనాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. ఈ–చలాన్ ప్రతిని తీసుకున్న అమీర్ దాన్ని చెల్లించడానికి అవసరమైన డబ్బు కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏటీఎంల చుట్టూ తిరిగాడు. 20 చోట్ల ప్రయత్నించినా డబ్బు దొరకలేదు. తిరిగి ఉమెన్స్ కాలేజీ వద్దకు వచ్చిన అమీర్.. అక్కడి ఇండిక్యాష్, ఫెడరల్ బ్యాంక్ ఏటీఎంల్లోకి వెళ్లాడు. అక్కడా ‘నో క్యాష్’బోర్డు కనిపించడంతో తీవ్ర అసహనానికి గురై కాలితో వాటి అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో అమీర్ కాలికి తీవ్రగాయమైంది.
అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అమీర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఐదు కుట్లు వేశారు. అక్కడి నుంచి అతడిని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రజా ఆస్తుల విధ్వంసక చట్టంలోని 427 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు చలాన్ చెల్లించమంటూ వేధించడం, ఏటీఎం కేంద్రాల్లో డబ్బు లేకపోవడంతోనే తాను అసహనానికిలోనై ఏటీఎం కేంద్రాన్ని ధ్వంసం చేశానని అమీర్ మీడియాతో చెప్పాడు.
కార్డు ద్వారానూ చెల్లించవచ్చు
మూడు అంతకంటే ఎక్కువ ఈ–చ లాన్లు పెండింగ్‌లో ఉంటేనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. జరిమానా మొత్తాన్ని పోలీసులు నగదుగా తీసుకోరు. ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలతో పాటు ఆన్‌లైన్ ద్వారా చెల్లించే ఆస్కారం ఉంది. అక్కడ నగదే కాదు డెబిట్/క్రెడిట్ కార్డులు సైతం వినియోగించవచ్చు. వాహన చోదకులు ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవడం ద్వారా తమ వాహనంపై జారీ అయిన ఈ–చలాన్లు ఎన్నో తెలుసుకోవచ్చు. ఎప్ప టికప్పుడు వాటిని క్లియర్ చేస్తే ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ఇబ్బందులు ఉండవు.
– ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ