8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 8వ తేదీ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడత పరామర్శ యాత్రను ప్రారంభించనున్నారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపడుతున్న ఈ యాత్రలో భాగంగా ఆమె అయిదు రోజుల పాటు ఈ జిల్లా లోని 19 కుటుంబాలను కలుసుకుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ శుక్రవారం సమావేశమై యాత్ర రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసింది. అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
8వ తేదీన ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసం నుంచి షర్మిల యాత్ర మొదలై, నేరుగా మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి చేరుకుంటుంది. అక్కడ షర్మిల, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం పరిధిలోని ఇర్వెన్, దేవునిపడ్కల్, వెల్జాలలో మూడు కుటుంబాలను పరామర్శిస్తారు. సాయంత్రం కల్వకుర్తికి చేరుకుని అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
9వ తేదీ ఉదయం అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ చేరుకుని, అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించి, ఆ తర్వాత అచ్చంపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎత్తం, కొల్లాపూర్‌లలో రెండు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు.
10న కొల్లాపూర్ పరిధిలోని పెంట్లవల్లి, వనపర్తి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల, దేవరకద్ర పరిధిలోని రాణిపేట, గద్వాల పరిధిలోని నందిన్నెలో నాలుగు కుటుంబాలను కలుసుకున్న అనంతరం ధరూర్ చేరుకుని అక్కడే బసచేస్తారు.
11న మక్తల్ నియోజకవర్గంలోని జూరాల, దేవరకద్ర పరిధిలోని కొన్నూరు, కొడంగల్ పరిధిలోని కోస్గి, అమీన్‌కుంట, ఇండాపూర్‌లలో 5 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. సాయంత్రం కొడంగల్‌కు చేరుకుని అక్కడే బసచేస్తారు.
12న జడ్జెర్ల నియోజకవర్గంలోని గుండ్ల పొట్లంపల్లి, షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద ఎర్కిచర్ల, నర్సప్పగూడ, మల్లాపూర్‌లలో నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. అదేరోజు సాయంత్రం షాద్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.
షర్మిల యాత్ర ఏర్పాట్లపై పార్టీ సమీక్ష
ఈ నెల 8-12 తేదీల మధ్య మహబూబ్‌నగర్ జిల్లాలో షర్మిల చేపట్టనున్న పరామర్శయాత్ర ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ తెలంగాణ శాఖ సమీక్షించింది. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రకమిటీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి, జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, శివకుమార్, రెహ్మాన్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. యాత్ర రూట్‌మ్యాప్‌తో పాటు, యాత్ర ఏర్పాట్లపై ఈ సందర్భంగా చర్చించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పది నియోజకవర్గాల పరిధిలో 5 రోజుల్లో 921 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది.