
మాట తప్పకుండా..
- జిల్లాకు వచ్చిన వైఎస్ షర్మిల
- జనగామ నియోజకవర్గంలో పరామర్శ యాత్ర ప్రారంభం
- మొదటి రోజు ఏడు కుటుంబాలు పూర్తి
- బైరాన్‌పల్లిలో వీరులకు నివాళులు
- తొలి రోజు 154 కిలో మీటర్లు సాగిన యాత్ర
- నేడు మరో ఏడు కుటుంబాలకు పరామర్శ
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మాట తప్పని కుటుంబం ఇచ్చిన ఆన నిలబెట్టుకుంది. వైఎస్సార్ కుటుంబం నమ్ముకున్న వారి చెంతకు వచ్చింది. దివంగత మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా కొమురవెల్లి ఆల య ద్వారం మార్గంలో చేర్యాలకు చేరుకున్నారు.
చేర్యాల మండల కేంద్రంలోని బస్వగల్ల యాదగిరి కు టుంబాన్ని పరామర్శించారు. మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో కర్ర రాజిరెడ్డి కుటుంబాన్ని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బచ్చన్నపేట మండ లం కట్కూరులో పాశికంటి శోభారాణి కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు. అదే గ్రామంలోని గుంటిపల్లి వెంకటేశ్ కుటుంబాని ధీమా కల్పించారు. బండనాగారంలో మానెపల్లి సిద్ధులు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కేసిరెడ్డిపల్లెలో గాదెపాక సిద్ధులు కుటుంబానికి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అలీంపూర్‌లో చాడ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఏడు కుటుంబాల పరామర్శ ముగిసిన తర్వాత బచ్చన్నపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో బస చేశారు. తొలి రోజు 154 కిలో మీటర్ల దూరంలో షర్మిల యాత్ర సాగింది.
యూత్ర ఇలా..
మహానేత వైఎస్సార్ తనయ షర్మిల రాక సందర్భంగా చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట మండలాల్లో సందడి నెలకొంది. ప్రతి గ్రామంలోనూ స్థానికులు రోడ్డు మీదకు వచ్చి ఆమె రాకకోసం ఎదురుచూశారు. షర్మిల తన వాహనం దిగి మరీ అందరినీ పలుకరించారు. మద్దూరు మండలం వల్లంపట్ల మీదుగా షర్మిల వెళ్తుండగా మహిళల బృందం అభివాదం చేసింది. తెలంగాణ సాయుధపోరాటంలో చారిత్రక ఉద్యమ కేంద్రంగా ఉన్న వీరబైరాన్‌పల్లిలో అమరవీరులకు షర్మిల నివాళులర్పించారు.
అన్ని తెలుసుకుంటూ..
మహానేత వైఎస్సార్ అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల ప్రతి కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరించారు. ఆరోగ్య పరిస్థితులకు ఆరా తీశారు. వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయని అడిగారు. కట్కూరులో పాశికంటి శోభారాణి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో.. శోభారాణి పెద్ద కుమార్తె కల్పనతో మాట్లాడుతూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు.
పరామర్శ ముగిసి షర్మిల ఇంట్లో నుంచి బయటికి వచ్చే సమయంలో కల్పన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. షర్మిల.. కల్పనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ‘నువ్వు బాధపడవద్దమ్మా... నువ్వు బాధపడితే నాకు బాధ కలుగుతుంది. నీకు నేనున్నానమ్మా’ అని చెమ్మగిలిన కళ్లతో షర్మిల ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో తొలిరోజు పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గ ట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి వి.శంకరాచారి పాల్గొన్నారు.
మంగళవారం మరో ఏడు కుటుంబాలు
పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మంగళవారం మరో ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రంలోని గుడిసెల లచ్చవ్వ, అలువాల యాదగిరి కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు. ఇదే మండలంలోని పోచన్నపేటలోని నేలపోగుల యాదగిరి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలోని గాదె శంకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని వల్లాల లక్ష్మయ్య కుటుంబానికి భరోసా ఇస్తారు. ఇదే మండలంలోని తాటికొండలోని ఎడమ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా కిష్టాజిగూడెంలోని జక్కుల కొమురయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. రెండో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో షర్మిల 78 కిలో మీటర్ల దూరం మేరకు యాత్ర సాగుతుంది.