వైఎస్ పథకాలకు అభిమానులే రక్షకులు:షర్మిల | YSR fans defenders to his schemes: YS Sharmila | Sakshi
Sakshi News home page

వైఎస్ పథకాలకు అభిమానులే రక్షకులు:షర్మిల

Published Tue, Dec 9 2014 5:40 PM | Last Updated on Tue, May 29 2018 6:01 PM

వైఎస్ షర్మిల - Sakshi

వైఎస్ షర్మిల

మహబూబ్నగర్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడిని అభిమానించి, ప్రేమించి, గుండెలలో పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. అందుకే పేదవాడి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆయన అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఆమె రెండవరోజు పరామర్శ యాత్ర ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. మన్ననూరులో ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి అమ్రాబాద్ చేరుకొని అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం అమ్రాబాద్, అచ్చంపేటలలో అశేష అభిమానులు ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మహానేత వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రతిపేదవాడికీ అందేలా పోరాడవలసిన బాధ్యత అయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మనందరదీ అన్నారు.


ప్రతిపేదవాడు గర్వంగా తలెత్తుకొని కార్పోరేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకునేలా 'ఆరోగ్యశ్రీ' అనే అద్భుత పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదని 'ఫీజు రీయింబర్స్మెంట్' పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించారని చెప్పారు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 'ఇందిరమ్మ ఇల్లు' పథకం ద్వారా 46లక్షల పక్కా ఇళ్లు నిర్మించారనన్నారు. అలాగే 104, 108, జలయజ్ఞం, ఉచిత విద్యుత్... వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయిదేళ్లపాటు ఏ ఒక్క ఛార్జీ, పన్ను పెంచకుండా పాలన సాగించారని చెప్పారు.

ఒక వ్యక్తి మరణిస్తే ఆ బాధ తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక కొన్ని వందల మంది మరణించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడైనా చూశామా? అని ఆమె ప్రశ్నించారు. అది ఒక్క మహానేత విషయంలో జరిగిందన్నారు. ఆయన అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షానే ఉన్నారని, అందువల్లే అలా జరిగిందని తెలిపారు.

అమ్రాబాద్లో వైఎస్ మరణ వార్తను జీర్ణించుకోలేక అమరుడైన పర్వతనేని రంగయ్య భార్య అనసూయను షర్మిల పరామర్శించారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.  ఆ తరువాత ఎత్తం గ్రామంలో నరసింహ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. తాము అండగా ఉంటామని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ఈ యాత్రంలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు మామిడి శ్యాం సుందర రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బీస్వా రవీందర్, ఎడ్మ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
**

 

మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement